రాష్ట్రంలో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) రుణంతో చేపడుతున్న రహదారుల పనులకు దాదాపు 2 నెలల కిందట బ్యాంకు రుణం కింద వచ్చిన మొత్తాన్ని గుత్తేదారులకు చెల్లించకుండా ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేసుకున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అందరు గుత్తేదారు సంస్థలు పనులను సాగదీస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ. 1,855.80 కోట్లతో పనులను గుత్తేదారులకు అప్పగించగా, తాజా సమాచారం ప్రకారం ఇప్పటికి రూ. 115.87 కోట్ల మేర (6.24 శాతం) పనులే జరిగాయి.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 13 రహదారుల విస్తరణ పనులను రూ. 194.16 కోట్లతో ఓ గుత్తేదారు సంస్థ దక్కించుకుంది. ఇందులో రూ.12.20 కోట్ల మేర (6.28 శాతం) పనులే చేసింది. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు నుంచి తాడేపల్లి వద్ద సీతానగరం వరకు ఉన్న రహదారిలో 8.015 కి.మీ. విస్తరిస్తున్నారు. ఇది సీఎం క్యాంపు కార్యాలయం (ఇంటి) ముందు నుంచి వెళ్తుంది. బిల్లులు చెల్లించక పనులు మందగించాయి. సీఎం క్యాంపు కార్యాలయం ముందు రహదారిని కూడా కొద్దిరోజులు ఆపేసింది. వర్షాల వల్ల పనులు ఆపేశారని చెబుతున్నప్పటికీ.. బిల్లులు ఇవ్వకపోవడమే అసలు కారణమని తెలిసింది. ఏదో మొక్కుబడిగా అప్పుడప్పుడు చేస్తున్నారు.
ఎన్‌డీబీ రుణం రూ.230 కోట్లు వచ్చినా, ప్రభుత్వం గుత్తేదారులకు చెల్లించకపోవడంతో.. పలు జిల్లాల్లో మాదిరిగానే, గుంటూరు జిల్లా గుత్తేదారు పనులు చేయలేదు. ఇదే విషయాన్ని ఇటీవల ఆర్‌అండ్‌బీ మంత్రి దాడిశెట్టి రాజా వద్ద జరిగిన సమావేశంలో గుత్తేదారులంతా గట్టిగా చెప్పారు. దీంతో గుంటూరు జిల్లాలో పనులు చేస్తున్న గుత్తేదారుకు గత వారం రూ.9 కోట్ల మేర, ఇతర జిల్లాల్లోని కొందరికి మంగళవారం సాయంత్రం దాదాపు రూ.15 కోట్లు ఇచ్చారు.