ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విధి వంచితుడిపై ఈటీవీ కథనానికి స్పందన.. - గుంటూరు తాజా వార్తలు

అనుకోని ప్రమాదం అతడిని మంచానికే పరిమితం చేసింది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కష్టాల్లో తోడుగా ఉండాల్సిన భార్య వదిలివెళ్లింది. ఏం చేయాలో తెలియని అతని దయనీయ స్థితిపై.. ఈటీవి ప్రసారం చేసిన కథనానికి దాతలు స్పందించారు. ఆపన్నహస్తం అందించారు. ఆర్థిక సాయంతో ఒకరు.. జీవితానికి ఆసరాగా ఉండే ఉద్యోగం ఇచ్చి మరొకరు.. అండగా నిలబడ్డారు.

response for etv story
ఈటీవీ కథనానికి ఆపన్నహస్తం

By

Published : Apr 4, 2021, 9:42 AM IST

ఈటీవీ కథనానికి స్పందన

గుంటూరు నగరంలోని కొండా వెంకటప్పయ్య కాలనీకి చెందిన సురేష్.. ఏసీ మెకానిక్​గా పనిచేసే వారు. పనిచేస్తున్న సమయంలో భవనం పైనుంచి జారిపడ్డాడు. రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ఐదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. కట్టుకున్న భార్య వదిలేసి వెళ్లటం.. అన్నింటికీ అమ్మానాన్నపై ఆధారపడాల్సి రావటం.. సురేష్​ని కుంగదీసింది. అతని దీనస్థితిని చూసిన ఈటీవీ.. ఆదుకోవాలంటూ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. కథనాన్ని చూసి.. హైదరాబాద్​కు చెందిన పారిశ్రామికవేత్త చదలవాడ శ్రీనివాసరావు స్పందించి.. లక్ష రూపాయల ఆర్థిక సాయం ఈటీవీ ద్వారా అందజేశారు. ఆ డబ్బుతో బ్యాటరీతో నడిచే స్కూటర్​ని కొనుగోలు చేసిన సురేష్.. మిగిలిన డబ్బుని వైద్యం కోసం వినియోగించారు.

ఆదుకున్న స్నేహితుడు..

అదే సమయంలో సురేష్ చిన్ననాటి మిత్రుడు రవిశంకర్​ కూడా..ఈటీవీ కథనం చూసి స్పందించారు. తన మిత్రుడికి వచ్చిన కష్టం చూసి చలించిపోయి.. తన గ్యారేజ్లోనే సురేష్​కు ఉద్యోగం ఇచ్చాడు. ఏసీలు మరమ్మత్తులు చేయటంలో సురేష్​కు ఉన్న అనుభవం ఇక్కడ పనికొచ్చింది. రవిశంకర్ నేరుగా ఇళ్ల వద్దకు వెళ్లి ఏసీలు మరమ్మత్తులు చేస్తుంటే.. గ్యారేజీ వద్దకు వచ్చిన వాటిని సురేష్ బాగు చేస్తున్నారు. దుకాణం నిర్వహణ బాధ్యతలు కూడా సురేష్​కే అప్పగించారు. సురేష్​లో ఆత్మన్యూనతా భావం తొలగిపోయి.. తానూ కష్టపడి పనిచేస్తున్నాననే సంతృప్తి మిగిలింది. సంపాదించిన డబ్బుతో కుటుంబానికి ఆసరాగా నిలవటం సంతోషంగా ఉందన్న సురేష్.. తన కుమార్తెను కూడా చదివించుకుంటున్నట్లు తెలిపారు. సురేష్ వచ్చిన తర్వాత తన పనీ సులువైందని ఉద్యోగం ఇచ్చిన రవిశంకర్ చెబుతున్నారు.

సురేష్ పరిస్థితి చూసి జాలిపడటం కాకుండా.. అతన్ని జీవితంలో నిలబెట్టాలని చదలవాడ శ్రీనివాసరావు, రవిశంకర్ ఆలోచించారు. అందువల్లే సురేష్ జీవితంలో కొత్తశకం మొదలైంది. ఈ క్రమంలో తన కష్టాన్ని తెలియజేసి సాయం అందించటంలో తోడ్పడిన ఈటీవీకి..సురేష్ కృతజ్ఞతలు తెలిపాడు.

ఇదీ చదవండి:తెలుగు ప్రాచీన హోదాను కాపాడుకుందాం

ABOUT THE AUTHOR

...view details