గుంటూరు జిల్లాలో నకిలీ చలానాలల వ్యవహారంపై రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు స్పందించారు. సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని.. కొందరు ఈ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 35 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డులు తనిఖీలు చేశామని.. కేవలం మంగళగిరి రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రమే అక్రమాలు జరిగినట్లు తేలిందని వివరించారు.
అక్కడ.. 7 రిజిస్ట్రేషన్లకు సంబంధించి రూ. 7 లక్షల 95 వేల విలువైన నకిలీ చలానాలు జత చేసినట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో 7 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. మరోవైపు.. పాత సాఫ్ట్ వేర్ స్థానంలో అత్యాధునిక సాంకేతికరతో రూపొందించిన కొత్త సాఫ్ట్వేర్ సోమవారం నుంచి వినియోగంలోకి రానుందన్నారు. ఈ నూతన సాంకేతికతతో ఎలాంటి అక్రమాలు జరగకుండా అరికట్టవచ్చని స్పష్టం చేశారు.