ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆకాశ గంగను ఒడిసి పట్టిన..అపర భగీరథుడు... - విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త ఏళ్ల రత్తయ్య

Rain Water Harvesting:పదవీ విరమణ చేసినా.. పట్టువదల్లేదు. వేసవి కాలంలో నీటి ఎద్దడిని జయించడానికి ఆయన ప్రయత్నించారు. వృధాగాపోతున్న వర్షపు నీటిని ఒడిసి పట్టారు. అనుకున్నది సాధించారు. ఆకాశ గంగను భద్రపరిచి అపర భగీరథుడిగా...విజయవంతమయ్యాయి.

Rain Water Harvesting
Rain Water Harvesting

By

Published : Jun 15, 2022, 3:16 PM IST

ఆకాశ గంగను ఒడిసి పట్టిన..అపర భగీరథుడు...

Rain Water Harvesting: ఆకాశ గంగను భువికి తెచ్చిన భగీరథుడికి నూతన రూపం ఆయన. మండు వేసవిలోనూ.. నీటి ఎద్దడిని అధిగమించిన అపర భగీరథుడు. వర్షపు నీటినే ఒడిసిపట్టి.. జలమున్న వాడిదే బలమంటూ నిరూపించిన జల పుత్తడు. ఇంటి పైకప్పుపై పడిన వర్షపు నీటినే ఆదా చేస్తూ.. నీటి కొరతపై విజయం సాధించి ఆచార్యుడు. ఆయనే గుంటూరు జిల్లాకు చెందిన విశ్రాంత శాస్త్రవేత్త ఏళ్ల రత్తయ్య.

అసోం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఫ్లాంట్‌ పాథాలజీ విభాగంలో ఆచార్యుడిగా పనిచేశారు గుంటూరు జిల్లా భారత్‌ పేటకు చెందిన ఏళ్ల రత్తయ్య. వేసవి కాలంలో జిల్లాలో నీటి ఎద్దడిని గమనించిన ఆయన.. దానిపై ఎలాగైనా విజయం సాధించాలనుకున్నారు. 15 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేసిన ఆయన.. అప్పటి నుంచే దీనిపై ప్రయత్నాలు మెుదలుపెట్టారు. దీని కోసం ఇంటిని నీటి సంరక్షణ కేంద్రంగా మార్చారు. అలా.. ఇంటి పైకప్పుపై పడే వాననీటినే.. నిల్వ చేయడం ఆరంభించారు. పై భాగంలో పడే నీటిని నిల్వ చేయడానికి వీలుగా.. కింద ట్యాంకులను నిర్మించి పీవీసీ పైపులు ఏర్పాటు చేశారు. వాన నీటి శుద్ధి కోసం ఫిల్టర్‌ అమర్చారు.

వర్షాకాలంలో ట్యాంకు నిండి నీరు వృథాగా పోకుండా ఉండేందుకు కింద బోరుతో పాటు ఇంకుడు గుంతను అనుసంధానం చేశారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి ఫిల్టర్ ద్వారా ట్యాంకుకు పంపిస్తారు. ఒక్కసారి ట్యాంకులోకి నీరు వెళ్లాక బ్యాక్టీరియా, ఇతర హానికర క్రిములుండవని.. తాగేందుకు ఈ నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుందన్నారు. ఏడాదంతా ఈ నీరు ఉపయోగించడం వల్ల ఎలాంటి అనారోగ్యం రాదన్నారు

'ప్రపంచంలో ఉన్న అన్ని రకాల నీటిలో కన్నా తాగటానికి వర్షపు నీరు చాలా శ్రేష్ఠమైనది. చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఎలాంటి హానికరమైన లవణాలు ఉండవు. బాక్టీరియా కూడా ఈ నీటిలో ఉండవు. తాగడానికి దీనికి మించిన నీరు లేదు.' -ఏళ్ల రత్తయ్య, విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త

నిల్వ ఉంచిన నీటిని ఇప్పటికే చాలాసార్లు పరీక్షల కోసం పంపారని.. అందులో ఎలాంటి హానికారకాలు లేవని చెబుతున్నారాయన. వర్షాకాలంలో పట్టుకున్న నీళ్లు ఓ కుటుంబం సంవత్సరమంతా తాగడానికి సరిపోతాయన్నారు. నీటిశుద్ధి ఫిల్టర్, పైపులు, ట్యాంకు కోసం 40 వేల రూపాయల వరకు ఖర్చవుతుందని.. వర్షపు నీరు ఎంతో మంచిదని రత్తయ్య అంటున్నారు.

'డాబా మీద పడ్డ వాన నీరు.. ఫిల్టర్ లోకి వెళ్లి.. అక్కడ వడకట్టబడి నిల్వ చేసే ట్యాంక్ లోకి వస్తాయి. ఈ నీరు సంవత్సరం పాటు నిల్వ ఉన్నా ఏమాత్రం మార్పురాదు. నిల్వ ఉన్నా కొద్దీ దీని క్వాలిటీ పెరుగుతుంది. వర్షపు నీరు ప్రత్యేకత ఇది. ఒక డాబా మీద పడ్డ వర్షపు నీటిని మనం ఒడిసి పట్టుకుంటే ఒక సంవత్సరం పాటు తాగడానికి, వాడకానికి సరిపడా నీరు ఉంటాయి.'-ఏళ్ల రత్తయ్య, విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త

విలువైన నీటిని వృథాగా పోనివ్వరాదని.. భవిష్యత్తులో అందరూ ఈ మార్గాన్ని తప్పక అనుసరించాలని రత్తయ్య చెబుతున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details