Property Tax Hike : పెరిగిన పన్నుల భారం సామాన్యుల్ని కుదేలు చేస్తోంది. నగరాలు, పట్టణాల్లో ఆస్తి పన్ను పెరగడంతో పాటు చెత్తపన్ను కూడా జతకావడంతో ప్రజలకు భారంగా మారింది. గతంతో పోలిస్తే 15 నుంచి 20శాతం మేర పన్నులు ప్రస్తుతం అధికమయ్యాయి. ముఖ్యంగా విలువ ఆధారితంగా ఆస్తిపన్ను విధానంను ప్రవేశపెట్టడం పట్టణవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. అది కూడా గతేడాది నుంచి పన్నులు చెల్లించాలని నోటీసులు రావడంతో నగరవాసుల్లో గుబులు రేగుతోంది.
2021 ఏప్రిల్ 1 నుంచి ఆస్తిపన్ను 15 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్నులు విధిస్తామని పేర్కొంది. దీనిపై అప్పట్లోనే ఆందోళనలు జరిగాయి. పురపాలిక ఎన్నికల సమయంలో వెనక్కితగ్గిన ప్రభుత్వం 2021 సంవత్సరానికి పాత పన్నులే వసూలు చేస్తామని ప్రకటించింది. సత్వరం పన్నులు చెల్లించినవారికి 5శాతం మేర రాయితీ కూడా ఇచ్చి వసూలు చేసింది. గుంటూరు నగరపాలక సంస్థ 2021 ఆగస్టు2న అస్తిపన్ను పెంపుపై తీర్మానం చేసింది. విపక్షాల ఆందోళనలు పట్టించుకోలేదు. మూలధన విలువ ఆధారిత పన్నులను వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టుని ఆశ్రయించారు. పిటిషన్ విచారణలో ఉండగానే పెంచిన పన్నులు చెల్లించాలంటూ గుంటూరు నగరంలో నివాస భవనాలు, వాణిజ్యసముదాయాల యజమానులకు నోటీసులు వస్తున్నాయి. గతంలో పన్ను చెల్లించిన వారికి ప్రత్యేకంగా డిమాండ్ నోటీసు ఇస్తున్నారు. గుంటూరుతోపాటు..తెనాలి, సత్తెనపల్లి, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, రేపల్లె, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి పురపాలికల్లోనూ నోటీసులు జారీ చేస్తున్నారు. కనీసం అభ్యంతరాలు తెలియజేసే అవకాశం కూడా ఇవ్వటం లేదని యజమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇదీ చదవండి :Farmers Problem: మేము ఏం చేయాలి.. మాకు దారేది.. రైతుల ఆవేదన
" పెంచిన పన్నులపై ప్రజలు అసహనంతో ఉన్నారు. గత రెండేళ్లుగా కరోనాతో అతలాకుతలం అంతా అయ్యారు. ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ప్రజలకు ఇది మరింత భారంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం పెంచిన పన్నుల్ని తగ్గించుకుంటే మంచి పేరుంటుంది. లేదంటే పరిణామాలు మరోలా ఉంటాయి." -శివనాగేశ్వరరావు, గుంటూరు నగరవాసి.
"గతేడాది ఏప్రిల్ నెలలో కార్పోరేషన్ వారు పాత పన్నునే కట్టించుకుంటామని సర్య్కులర్ ఇచ్చారు. కానీ..భవిష్యత్తులో కొత్త పన్ను ప్రకారం పన్ను తీసుకుంటామని ఎక్కడా చెప్పలేదు. చెప్పకుండానే పెరిగిన పన్ను కట్టమని నోటీసులు జారీ చేస్తున్నారు. గతంలో ఉన్న అభ్యంతరాలకే సమాధానం ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు సమాధానం ఇస్తుందా?ఆస్తి మూలధన విలువ ఆధారిత పన్నును ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అమలు చేస్తుంది. గతంలో అమలు చేసిన రాష్ట్రాలు ఈ పన్నును ఉపసంహరించుకుని యథావిధిగా పాత పద్ధతిలో వెళ్తున్నాయి." - వెంకటసుబ్బారావు, న్యాయవాది, గుంటూరు
" ప్రభుత్వం చాలా నమ్మక ద్రోహం చేస్తుంది. చట్టం ఆస్తి మూలధన విలువ ఆధారంగా ఇంటి పన్ను వేస్తామని చెబుతుంది. మున్సిపల్ మంత్రి గత ఏడాదితో పోల్చితే కేవలం 15శాతం మాత్రమే ఇంటి పన్ను పెరుగుతుందని చెప్పారు. ఈ జీవోలకి, చట్టాలకి పోటీ వస్తే కచ్చితంగా చట్టమే అమలులోకి వస్తుందని ఆనాటి నుంచి చెబుతూనే ఉన్నాం. " -నళినికాంత్, గుంటూరు నగరవాసి