కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలకు ఆరోగ్య ప్రదాయనిగా ఉన్న... గుంటూరు సర్వజనాస్పత్రిలో సేవలు పొందడం పేదలకు కష్టతరంగా మారుతోంది. సిబ్బంది కొరత, ప్రణాళికా లోపాలతో... దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులు యాతనలకు గురవుతున్నారు. ప్రత్యేక వైద్యసేవలకు జీజీహెచ్ పేరు పొందినందునా... నిత్యం 4వేల మంది వరకూ రోగులు ఆసుపత్రికి వస్తున్నారు.
గుంటూరు సర్వజన ఆసుపత్రికి ఏమైంది..? - గుంటూరు సర్వజన ఆసుపత్రి
గుంటూరు సర్వజన ఆసుపత్రికి వచ్చే రోగుల కష్టాలు పెరుగుతున్నాయి. అధునాతన వైద్యసేవలు అందుబాటులో ఉన్నా... వాటిని పొందాలంటే గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. వైద్యులు, సిబ్బంది కొరత, ప్రణాళికా లోపాలు నిరుపేద వ్యాధిగ్రస్తులను యాతనకు గురిచేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే... ఆసుపత్రికి చెడ్డపేరు రావడానికి ఎక్కువ సమయం పట్టదని స్థానికులు చెబుతున్నారు.
ఈ ఆసుపత్రికి వచ్చినవారు ఓపీ చీటీ కోసం గంటన్నర... వైద్యుడిని కలిసేందుకు మరో గంటన్నర... ఇలా ఒక్కో వ్యక్తి 3 గంటల వరకూ లైనులో నిలబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. పరీక్షలు పూర్తి చేసుకొని మళ్లీ వైద్యుడిని కలవాలంటే... వారం రోజులైనా వేచి చూడాల్సిందే. ఎమ్మారై, ఈసీజీ, 2డీ ఎకో లాంటి పరీక్షల కోసమూ రోజుల తరబడి తిరగాల్సిందే.
వైద్యులు, సిబ్బంది కొరత ఈ పరిస్థితికి ప్రధాన కారణం కాగా... సమయపాలనా కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 55 బోధనా నిపుణుల పోస్టులు ఖాళీగా ఉండటం మరో కారణం. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పలు ప్రతిపాదనలు ఆచరణలోకి వస్తే... సమస్యలు చాలావరకూ తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 1848లో ఓ చిన్న గదిలో ప్రారంభమై... ఉత్తమ సేవలతో సుమారు 170 ఏళ్ల ఆరోగ్య చరిత్ర సొంతం చేసుకున్న జీజీహెచ్ అభివృద్ధికి... చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.