అథ్లెటిక్స్‌లో ప్రపంచస్థాయి లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ప్రకాశం జిల్లా యువకుడు మహేశ్... అలుపెరగకుండా శ్రమిస్తున్నాడు. సామాన్యులకు ఊహించేందుకైనా సాధ్యంకాని రీతిలో 300 కిలోమీటర్ల మారథాన్ పరుగును పూర్తి చేయడంపై గురి పెట్టాడు. ప్రపంచ రికార్డు సాధనే లక్ష్యంగా గుంటూరు నగర శివారు పేరేచర్లలో బుధవారం సాయంత్రం 6గంటల 15 నిమిషాలకు పరుగు ప్రారంభించాడు. ఫిరంగిపురం, నరసరావుపేట, వినుకొండ, త్రిపురాంతకం, యర్రగొండపాలెం, మార్కాపురం, కంభం, బెస్తవారిపేట, గిద్దలూరు, రాచర్ల మీదుగా... తిరిగి బెస్తవారిపేట చేరుకోవాలనే ప్రణాళికకు అనుగుణంగా పరుగు సాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం కల్లా 300 కిలోమీటర్ల పరుగు పూర్తి కానుంది.
ఏడాదిగా సాధన...
మధ్యలో ఎక్కడా ఆగేందుకు వీలు లేనందున... ఆహారం తీసుకోకుండా, కేవలం ఎనర్జీ డ్రింక్స్ సాయంతోనే మహేష్ పరుగు కొనసాగిస్తున్నాడు. అయితే... బూట్లు మార్చుకొనేందుకు వంద కిలోమీటర్లకు ఓసారి చొప్పున 2 చిన్నపాటి విరామాలతో పరుగు కొనసాగనుంది. గతంలో వంద కిలోమీటర్ల పరుగుని మహేశ్ 10 గంటల్లో పూర్తి చేశాడు. ఈసారి మరింత భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుని... అందుకోసం ఏడాదిగా సాధన చేశాడు.