గుంటూరు జిల్లాలో వరుసగా జరుగుతున్న నేర ఘటనలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. ప్రధానంగా నగర, పట్టణ, గ్రామ శివార్లలో నేరాలు అధికంగా జరుగుతున్నాయి. చీకటి పడితే చాలు ఆయా మార్గాల్లో వెళ్లేందుకు మహిళలు, విద్యార్థినులు జంకుతున్నారు. తాడేపల్లి సమీపంలోని నదీతీరంలో అత్యాచార ఘటనతోపాటు మేడికొండూరులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలు ఈ అంశాన్నే గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు దృష్టి సారించారు.
మంగళగిరి, తెనాలి, నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతికి వెళ్లే రహదారులు, శివారు ప్రాంతాలు, జాతీయ రహదారుల్లో రాత్రిపూట సంచారంపై నిఘా పెట్టారు. నగర శివారు ప్రాంతాల్లో అర్బన్ ఎస్పీ నేరుగా పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న వారి వివరాలు, సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతిరోజూ పోలీసు సిబ్బందితో బ్లూ కోట్స్ వాహనాలు, రక్షక్ వాహనంతో పెట్రోలింగ్ ముమ్మరం చేసి అల్లరి మూకల కదలికలపై నిఘా ఉంచాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.