ఆక్సిజన్ వాయువును ఒడిశా నుంచి గుంటూరుకు రవాణా చేస్తున్న ట్యాంకర్ ( నెంబర్: AP 31 TB 8127 ) వాహనం.. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సెంటర్లో యాక్సిల్ విరిగిపోయి అక్కడే నిలిచిపోయింది. సమాచారం అందుకున్న హనుమాన్ జంక్షన్ ఎస్సై పి.గౌతమ్ కుమార్ వెంటనే మరమ్మతులు చేయించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఆక్సిజన్ వాహనం ప్రయాణానికి అంతరాయం లేకుండా దగ్గర్లో ఉన్న రోడ్ సేఫ్టీ మొబైల్ వారి సహాయంతో దానికి తక్షణం మరమ్మతులు చేయించి.. ప్రయాణ మార్గాన్ని సుగమం చేశారు. కోవిడ్ వైద్యశాలల్లో ప్రస్తుతం ఆక్సిజన్ ప్రాముఖ్యత, క్షణం ఆలస్యమైతే జరిగే పరిణామాలను ఆలోచించి ఎస్సై సమయానుకూలంగా స్పందించారు. వారి అప్రమత్తతతో ఆక్సిజన్ ట్యాంకర్ రవాణాకు అంతరాయం ఎదురుకాకుండా... సమయానికి గమ్యస్థానానికి చేరుకుంది.