ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సాయం చేసిన చేతికి సున్నం రాశాడు..! - thief arrested in guntur news

సాయం చేసిన వ్యక్తి ఇంటికే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. పని కల్పించిన యజమాని ఇంట్లో 10 లక్షలు చోరీ చేశాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

Thief_Arrested
Thief_Arrested

By

Published : Nov 5, 2020, 11:40 PM IST

గుంటూరు బ్రాడీపేటలో స్టీల్ సామగ్రి వ్యాపారి ఇంట్లో దొంగతనం కేసును అరండల్​పేట పోలీసులు ఛేదించారు. కేసు నమోదు చేసిన 24 గంటల వ్యవధిలోనే దొంగను పట్టుకున్నారు. కేసు వివరాలను గుంటూరు వెస్ట్ ఇంఛార్జి డీఎస్పీ రమణకుమార్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

గుంటూరు బ్రాడీపేటకు చెందిన మునగాల రవి శంకర్ అనే స్టీల్ సామన్ల వ్యాపారి.. తన ఇంట్లో దాచుకున్న 10 లక్షల నగదు మాయం అయినట్లు బుధవారం అరండల్​పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గత వారం రోజులుగా ఇంటికి ఎవరు వచ్చి వెళ్లారని ఆరా తీశారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం వారి ఇంట్లో కరెంట్ పని చేసిన పిడుగురాళ్ల శివ శంకర్​ను పోలీసులు విచారించగా పొంతన లేని సమాధానం చెప్పాడు. తమదైన శైలిలో పోలీసులు అతన్ని ప్రశ్నించగా చోరీ తానే చేసినట్లు అంగీకరించాడు.

ఈ నెల రెండో తేదీ ఇంట్లో యజమాని భార్య ఒక్కరే ఉన్నప్పుడు వెళ్లిన శివ శంకర్... విద్యుత్తు మరమ్మతులు మిగిలి ఉన్నాయంటూ ఆమెను నమ్మించాడు. తెలిసిన వ్యక్తే కదా అని అతన్ని ఆమె లోనికి రానించింది. యజమాని భార్యను మెయిన్ స్విచ్ దగ్గర ఉండమని చెప్పి... బెడ్ రూమ్​లోకి వెళ్లిన నిందితుడు బీరువాలోని 10 లక్షల రూపాయల నగదును దోచేశాడు. కొన్ని స్విచ్ బోర్డులకు మరమ్మతులు చేసి పని అయిపోయింది మేడం అని చెప్పి వెళ్లిపోయాడు. ఇది జరిగిన రెండు రోజులకు నగదు చోరీకి గురైందని యజమానులు గుర్తించారని గుంటూరు వెస్ట్ ఇంఛార్జి డీఎస్పీ రమణ కుమార్ తెలిపారు. నిందితుడు దొంగలించిన సొమ్ము నుంచి లక్ష రూపాయలు వాడుకున్నారని.. మిగిలిన 9 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

కొన్ని రోజుల క్రితమే సాయం..

పోలీసుల విచారణలో మరో ఆసక్తికర విషయం తెలిసింది. శివ శంకర్​ ఇటీవలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే రవి శంకర్ 50 వేల రూపాయలు సాయం చేశాడని గుంటూరు వెస్ట్ ఇంఛార్జి డీఎస్పీ రమణ కుమార్ వెల్లడించారు. ఆ కృతజ్ఞతను మరిచి నిందితుడు దొంగతనానికి పాల్పడ్డాడని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details