తూర్పు గోదావరి జిల్లా అన్నవరం నుంచి రాజమండ్రి వైపు ఓ ఆటో వస్తోంది. అందులో దాదాపు అరడజను దేవుళ్ల చిత్రపటాలతో కొందరు ప్రయాణిస్తున్నారు. చూడ్డానికి భక్త బృందం మాదిరిగా ఉన్నారు. అయితే.. కిర్లంపూడి మండలం బూరుగు పూడి గ్రామం వద్దకు రాగానే.. వాళ్ల అసలు రంగు బయట పడింది. అక్కడే తనిఖీలు చేస్తూ సిద్ధంగా ఉన్న పోలీసులు.. అనుమానం వచ్చి లాఠీ అడ్డుపెట్టారు. ఆటోలోని దేవుళ్ల పటాలను తొలగించి చూసి నిశ్చేష్ఠులయ్యారు. దేవుళ్ల ఫొటోల వెనుక ఎవ్వరూ ఊహించని విధంగా గంజాయి బయటపడింది.
దేవుళ్ల చిత్ర పటాల కింద ఉన్న 5 చెక్క పెట్టెల్లో.. ఏకంగా 122 కిలోల గంజాయిని నిందితులు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ గంజాయి విలువ దాదాపు రూ. 5 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఇద్దరు నిందితులతోపాటు ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి రూ. 30 వేలు నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ జిల్లా నుంచి తమిళనాడుకు గత కొద్దిరోజులుగా ఇదే విధంగా గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు తమిళనాడుకు చెందిన సెల్వం, రౌతుల పూడి మండలం శ్రుంగ వరం గ్రామానికి చెందిన గాది వెంకట రమణగా గుర్తించారు. గంజాయి తరలించే వారు ఎవరైనా కఠినంగా శిక్షించి తీరుతామని డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్ హెచ్చరించారు.