గుంటూరు పట్టణంలోని పట్టాభిపురం రైతు బజార్ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ శాఖలు మార్కెట్‌ను ఒకచోట నుంచి మరోచోటుకు తరలిస్తున్నాయి. దీంతో ప్రజలు అయోమయం చెందుతున్నారు.
మొదట్లో స్వామి థియేటర్ వద్ద మెయిన్ రోడ్డు పక్కన రైతు బజార్‌ను ఏర్పాటు చేశారు. అయితే కోర్టు ఆదేశాలతో ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించారు. ఆ తర్వాత తాత్కాలికంగా కృష్ణా నగర్ లోని కృష్ణా ఆశ్రమం స్థలంలో రైతు బజార్ నిర్మిస్తామని అప్పట్లో వాగ్దానం చేసి కొంత నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. అయితే అది కూడా రోడ్డు కావడంతో దానిపైన కొందరు వ్యక్తులు కోర్టులో పిటిషన్లు వేయడంతో అర్ధాంతరంగా నిలిపివేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో విశాలమైన ప్రదేశంలోకి రైతు బజార్ని మార్చే క్రమంలో బృందావన్ గార్డెన్ ఎన్టీఆర్ స్టేడియంలోకి మార్చారు. అక్కడ వాకర్స్ కు ఇబ్బంది కలుగుతుందని స్టేడియంలోనే స్కేటింగ్ రింగు వద్దకు మార్చారు.
ఇప్పుడు ఏకంగా వేరే స్థలంలోకి రైతు బజారును తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో స్టేడియాన్ని ఖాళీ చేయాలని నగర పాలక సంస్థ అధికారులు రైతులకు చెప్పారు. దీంతో రైతు బజార్ వ్యాపారస్తులు గత్యంతరం లేని పరిస్థితుల్లో తీసుకువచ్చిన కూరగాయలను స్టేడియం బయట ఉన్న మెయిన్ రోడ్డుపై పోసుకుని విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా రోడ్డుపైన కొంత ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది.