అమూల్ పాల సేకరణ విధానంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం వహించారని గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి షోకాజ్ నోటీసులు ఇవ్వటాన్ని పంచాయతీ కార్యదర్శుల సంఘం తప్పుబట్టింది. పాల సేకరణపై అన్ని గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నా..పాడి రైతులు మక్కువ చూపటం లేదని, దానికి పంచాయతీ కార్యదర్శులను బాధ్యులను చేయటం సబబు కాదని సంఘం అధ్యక్షుడు ప్రసాద్ అన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన జాబ్ చార్టులో ఉన్నవే కాకుండా నూతనంగా ప్రవేశపెడుతున్న అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో కార్యదర్శులు తమ వంతు సహకారం అందిస్తున్నారన్నారు. అయినా తమకు అధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వటం, దుర్భాషలాడటం ఎంతవరకు సమంజసమని ప్రసాద్ ప్రశ్నించారు. నోటీసులు వెనక్కి తీసుకోవాలని కోరుతూ రేపు (శుక్రవారం) డీపీవోను కలవనున్నట్లు ఆయన వెల్లడించారు.