గుంటూరు జిల్లాలో 41 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు అధికారులు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు నగరంలో పాజిటివ్ కేసులు 25కు చేరుకోవటం కలవరపెడుతోంది. ఇప్పటికే 9కాలనీలను రెడ్జోన్లుగా ప్రకటించి అక్కడ లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేశారు. నగరపాలక సంస్థ తరపున పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ల ద్వారా క్రిమిసంహారక మందులు పిచికారి చేస్తున్నారు. అలాగే ఇంటింటి సర్వే నిర్వహించి అనారోగ్యంతో ఉన్నవారి వివరాలు ఆరా తీస్తున్నారు.
గుంటూరులో లాక్డౌన్ మరింత కఠినతరం - గుంటూరులో కరోనా వైరస్
గుంటూరు నగరంలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. లాక్‌డౌన్‌ను అధికారులు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలను రెడ్జోన్లుగా ప్రకటించారు. నగరమంతటా ఫైర్ ఇంజిన్ల ద్వారా క్రిమి సంహారకాలు చల్లుతున్నారు. వీటితో పాటు మరికొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నగరంలో కూరగాయల మార్కెట్లను ఇప్పటికే 14చోట్ల ఏర్పాటు చేసిన అధికారులు... అక్కడ కూడా ప్రజలు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. అలాగే మార్కెట్ వద్ద ప్రత్యేక టన్నెల్‌ను ఏర్పాటు చేసి వినియోగదారులు అందులో నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. టన్నెల్లోకి అడుగుపెట్టగానే క్రిమిసంహారక మందు స్ప్రే అయ్యేలా చర్యలు చేపట్టారు. తద్వారా ప్రజలపై ఏవైనా వైరస్ ఉంటే నశిస్తుందని అధికారులు చెబుతున్నారు. నగరంలోని మిగతా ప్రాంతాల్లో సైతం ఉదయం 9గంటల వరకే ప్రజల్ని బయటకు అనుమతిస్తున్నారు. ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ రోడ్లపైకి రావొద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చే వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో 15 కరోనా పాజిటివ్ కేసులు