రాష్ట్రంలో నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైను.. అటు కోస్తా ప్రాంతాన్ని, ఇటు మెట్ట ప్రాంతాన్ని అనుసంధానం చేసే కీలకమార్గం. కోస్తా మెట్టప్రాంతాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చగలిగే.. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గంలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. దిల్లీ- చెన్నై, హౌరా, చెన్నై ప్రధాన రైల్వేమార్గాలకు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన ఈ రైల్వే మార్గం.. నవ్యాంధ్ర అభివృద్ధికి జీవనాడి వంటిది.
గుంటూరు జిల్లా నడికుడి జంక్షన్ నుంచి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వరకూ.. 308 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైను మార్గాన్ని నిర్మించాలని ఏళ్ల కిందటే ప్రతిపాదించారు. దీనికి సర్వే పనులు పూర్తై.. కొత్త లైను నిర్మాణానికి.. రైల్వే శాఖ పచ్చజెండా ఊపిన తరువాత సైతం చాలా కాలంపాటు పనులు ప్రారంభం కాలేదు. 2016లో రాష్ట్ర ప్రభుత్వం ఈ రైల్వే లైనుపై దృష్టి సారించడంతో.. భూసేకరణను కూడా త్వరితగతిన పూర్తయ్యాయి. అప్పటి నుంచి పనుల పురోగతి ఊపందుకుంది. రూ. 2,300 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు తొలిదశలో గుంటూరు- హైదరాబాద్ మార్గంలోని నడికుడి వద్ద నుంచి.. గుంటూరు- గుంతకల్ మార్గంలోని శావల్యాపురం వరకూ రూ. 350 కోట్లతో ట్రాక్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. తొలిదశ మార్గాన్ని రెండు భాగాలుగా విభజించారు. నడికుడి- రొంపిచర్ల వరకూ 30 కిలోమీటర్ల భాగం ఇప్పటికే పూర్తి కాగా.. రొంపిచర్ల- శావల్యాపురం మార్గంలోని మిగతా భాగం కూడా ట్రాక్ నిర్మాణం పూర్తయింది. ట్రాక్ నిర్మాణం పూర్తయినప్పటికీ విద్యుద్దీకరణ పనులు పూర్తి కావాల్సి ఉంది.
''రైతులు పండించిన పంటను ఎగుమతి చేసుకునేందుకు రైలు మార్గం ఉపయోగకరంగా ఉంటుంది. మా ఊరు నుంచి బెంగళూరు, చెన్నై నగరాలకు ప్రయాణ సమయం, దూరం తగ్గుతుంది. ఇంతకు ముందు గుంటూరుకు వెళ్లి సరకు రవాణా చేయాల్సివచ్చేది. ప్రయాణ సమయం కలసి వస్తుంది.'' - శ్రీనివాసరావు, నెమలిపురి
'' రైలు మార్గం త్వరగా అందుబాటులోకి రావాలని చుట్టుపక్కల గ్రామాల వారందరూ కోరుకుంటున్నారు. అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణించడానికి ఈ మార్గం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.'' - పుల్లయ్య, నకరికల్లు