మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అనంతపురంలో సీఐటీయూ కార్మిక సంఘాలు అర్ధనగ్న నిరసన చేపట్టాయి. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నగరంలోని కోర్టు రోడ్డు సమీపంలో నినాదాలు చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నా.. కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో వేతనాలు ఇవ్వాలని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లాలో..
నరసరావుపేటలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు వినూత్నంగా మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 14, 15 తేదీల్లో మున్సిపల్ కార్మికుల సమస్యలపై నిర్వహించే సమ్మె కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.