గుంటూరు చంద్రయ్యనగర్లో నివాసం ఉంటున్న ఓ మహిళకు వివాహమై ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఆమె భర్త 5 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. ఆ తర్వాత ఆమె తన అక్క వద్ద ఉంటూ మిషన్ కుడుతూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఓ దర్జీతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. నెలలు నిండిన ఆమె ఈ నెల 11న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది.
ఈనెల 19వ తేదీన సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆసుపత్రిలో ఆమెకు సత్యవతి అనే మధ్యవర్తి పరిచయమైంది. జీజీహెచ్లో పనిచేస్తున్న హెడ్ నర్స్ నారాయణమ్మకు పిల్లలు లేరు. ఆమెకు పాపను ఇస్తే రూ.75 వేలు ఇప్పిస్తామని మధ్యవర్తి చెప్పింది. హెడ్ నర్స్ నారాయణమ్మ దగ్గర ఆ మధ్యవర్తి లక్ష రూపాయలు తీసుకుంది. బాలింత తల్లికి రూ.75 వేలు ఇచ్చి, తాను రూ.25 వేలు తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 19వ తేదీన గుంటూరు నగరంలోని అమరావతి రోడ్డులో నగదు ఇచ్చి పాపను తీసుకున్నారు. విషయం వార్డు వాలంటీర్ల ద్వారా చైల్డ్ లైన్ అధికారులకు తెలిసింది.