రబీ సీజన్‌కు సంబంధించిన ప్రణాళిక ఖరారు చేసేందుకు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఆధ్వర్యంలో గుంటూరులో సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్ కుమార్, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వ్యవసాయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రబీ సీజన్ ప్రణాళికపై వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి కన్నబాబు సమావేశంలో చర్చించారు. ఆరు జిల్లాల్లో రబీ పంటల సాగు, మార్కెటింగ్‌పై ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి కన్నబాబు తెలిపారు. వరి 62 లక్షల టన్నులు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
"మొక్కజొన్న 2.60 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించాం. రైతులు ఏ పంట పండించినా మార్కెటింగ్ సమస్య లేకుండా చర్యలు చేపడతాం. ఐదు వేలకు పైగా పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. మార్కెట్ రేటు కన్నా ఎక్కువ ధరకు పంటల కొనుగోళ్లు చేస్తాం" - కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖామాత్యులు