రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని.. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.
గుంటూరులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభించిన హోంమంత్రి
గతంలో పేదలకు ఎక్కడా ఒక్క సెంటు భూమి ఇవ్వకపోగా.. ఈ ప్రభుత్వం పేదలకు స్థలాలు ఇస్తున్నా.. గృహాలు నిర్మిస్తున్నా కోర్టులతో అడ్డుకుంటున్నారని.. హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. లబ్ధిదారులకు ఓటీఎస్ పథకం రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
ఒంగోలులో
ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఏ వన్ కన్వెన్షన్ హాలులో.. జగనన్న సంపూర్ణ హక్కు పథకాన్ని.. మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. లబ్ధిదారులకు గృహ రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేశారు. జిల్లాలో ఓటీఎస్ ద్వారా 2,90,040లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. గృహ హక్కు పథకంలో.. లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్టర్ చేసి డాక్యుమెంట్లు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ గృహ హక్కు పథకం ఉగాది చివరి నాటికి పొడిగిస్తున్నట్లు వివరించారు.
తూర్పుగోదావరిలో
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో.. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని మంత్రి కురసాల కన్నబాబు ప్రారంభించారు. జగనన్న సంపూర్ణ హక్కు పథకం వల్ల పేద ప్రజలందరికీ ఎంతో లబ్ధి చేకూరుతుందని.. ప్రతి ఒక్కరూ తమ గృహాలకు సంపూర్ణ హక్కుదారులు అవుతారని మంత్రి అన్నారు.
కర్నూలులో
కర్నూలు జిల్లాలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద రిజిస్ట్రేషన్ పట్టాలను.. మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు లబ్దిదారులకు అందజేశారు.పేద ప్రజలకు మంచి జరిగే విధంగా.. సీఎం జగన్ పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంటే.. ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శలు చెయ్యడం సరికాదన్నారు.
అనంతపురంలో..
అనంతపురం జిల్లాలోని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో.. మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సమక్షంలో.. సీఎం జగన్ జన్మదినాన్ని జరుపుకున్నారు. అనంతరం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. పెనుకొండలో ఎం.జే.పీ.బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో.. విద్యార్థులతో కలిసి సీఎం జన్మదిన కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ పాల్గొన్నారు.
శ్రీకాకుళంలో
శ్రీకాకుళం జిల్లా పలాసలో.. సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను.. మంత్రి సీదిరి అప్పలరాజు ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. కాశీబుగ్గ హై స్కూల్లో పార్టీ నేతలతో కలిసి మొక్కలను నాటారు.
నెల్లూరులో
నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని రాజన్న భవన్లో జలవనరుల శాఖా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. సర్వపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు.. సీఎం పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.
ఇదీ చదవండి:CM Jagan News: రూ.10 చెల్లిస్తే ఇంటిపై సర్వహక్కులు: సీఎం జగన్