తమ ఆస్తులపై తొమ్మిదేళ్లుగా సవాల్ చేస్తున్నా.. ఎవరూ స్వీకరించట్లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ప్రకటించిన ఆస్తుల కంటే ఎక్కువ ఉంటే ఇచ్చేస్తామని సవాల్ విసిరారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు లోకేశ్ ప్రకటించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు నిరూపించమంటే ముందుకు రారని ఎద్దేవా చేశారు.
నాన్నకు అప్పులున్నాయి.. నా ఆస్తి రూ.2 కోట్లు తగ్గింది: లోకేశ్ హెరిటేజ్ అందుకే..
రాజకీయాలపై ఆధారపడకూడదని హెరిటేజ్ స్థాపించామని నారా లోకేశ్ తెలిపారు. 15 రాష్ట్రాల్లో హెరిటేజ్ పాల ఉత్పత్తులు విక్రయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. దాని ద్వారా 3 వేల మందికి ఉపాధి దొరుకుతుందని స్పష్టం చేశారు. 'హెరిటేజ్‌కు 9 రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో ఆస్తులు లేవు. రాజధాని పరిధికి 30 కిలోమీటర్ల దూరంలో 2014 మార్చిలో భూములు కొన్నాం.'అని లోకేశ్ స్పష్టం చేశారు.
అమ్మ ఆస్తులు తగ్గాయి
గతంలో కంటే తన అమ్మ భువనేశ్వరి ఆస్తులు తగ్గాయని లోకేశ్ వెల్లడించారు. తన పేరిట ఉన్న షేర్లను బ్రాహ్మణికి బహుమతిగా ఇచ్చినట్లు వివరించారు. గతేడాదితో పోలిస్తే చంద్రబాబు ఆస్తులు రూ.87 లక్షలు పెరిగాయన్నారు. తాను ప్రకటించిన ఆస్తులు.. కొన్నప్పటి విలువ ప్రకారం చెప్పినట్లు స్పష్టం చేశారు. మార్కెట్ ధరలు హెచ్చు తగ్గులు ఉంటాయన్న లోకేశ్.. జగన్ మాదిరిగా తమకు బినామీ ఆస్తులు లేవన్నారు.
చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు అందుకే రాజకీయాల్లోకి వచ్చా
'23 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ట్రస్టు ఏర్పాటైంది. రెండు రాష్ట్రాల్లోనూ బ్లడ్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. విపత్తు సమయాల్లో మొదట స్పందించేది ఎన్టీఆర్ ట్రస్టు. యువరక్తం కావాలనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చా. కార్యకర్తలకు సభ్యత్వం ద్వారా రూ.2 లక్షల ప్రమాద బీమా తీసుకువచ్చాం. ప్రమాద బీమా ద్వారా 4 వేల 300 కుటుంబాలను ఆదుకున్నాం.' అని లోకేశ్ తెలిపారు.
మీ ఆస్తులు ప్రకటించండి
చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ దాడులు జరిగాయన్న లోకేశ్.. ఐటీ అధికారుల పంచనామాలో రూ.2.68 లక్షలు ఉన్నట్లు తేలిందని స్పష్టం చేశారు. జగన్ రూ.43 వేల కోట్లు దోచుకున్నట్లు సీబీఐ అభియోగం ఉందన్నారు. 2009లో లక్షల్లో ఉన్న జగన్ ఆస్తులు ఇప్పుడు రూ.42 వేల కోట్లు ఎలా అయ్యాయని ప్రశ్నించారు. అందుకే ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు వెళ్తున్నారని లోకేశ్ విమర్శించారు. జగన్ ఆస్తులపై మాత్రం సమాధానం చెప్పట్లేదన్నారు.