ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి నుంచి గుంటూరు జిల్లాలో లాక్​ డౌన్​ - corona cases in guntur

గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. నానాటికీ పెరుగుతున్న కేసులతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం కేసులు సంఖ్య దాదాపు 6 వేలకు చేరువైంది. గుంటూరు నగరంతో పాటు నరసరావుపేట, మంగళగిరి, తాడేపల్లి, తెనాలిలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కాలనీల్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులు... నేటి నుంచి లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.

Lock down in Guntur
Lock down in Guntur

By

Published : Jul 18, 2020, 6:23 AM IST


కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో గుంటూరు ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. కొత్తగా జిల్లాలో 226 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 5వేల 711కు చేరినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. 2 వేల 105 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ 39మంది మరణించారు. జిల్లాలో మార్చి, ఏప్రిల్ నెలల్లో కలిపి 287 కేసులు రాగా... మే నెలలో 223 నమోదయ్యాయి. జూన్ లో 1095 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇక జులై నెలలో పట్టపగ్గాలు లేకుండా రోజుకు 200 నుంచి 300 కేసులు వెలుగు చూస్తున్నాయి. జూన్ నెలాఖరు వరకూ 1605కేసులుండగా.... కేవలం జులై నెలలోనే 4వేల 106 కేసులు నమోదయ్యాయి.

నేటి నుంచి గుంటూరు జిల్లాలో లాక్​ డౌన్​
కరోనా వైరస్ నివారణ చర్యలపై కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. గుంటూరు నగరపాలక సంస్థతో పాటు గుంటూరు, తెనాలి, నరసరావు పేట, దాచేపల్లి రెవిన్యూ డివిజన్ల పరిధిలో5 రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంటైన్మెంట్‌ జోన్లలో చేపట్టాల్సిన చర్యలు, ప్రైమరీ కాంటాక్టుల గుర్తింపు, కరోనా పరీక్షలు, అనుమానితుల క్వారంటైన్‌, కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు, ఆసుపత్రులు సిద్ధం చేయటం వంటి పనులను ఈ 5 కేంద్రాల్లో చూడాలన్నారు. గ్రామ స్థాయి నుంచి సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు డివిజన్, జిల్లా కేంద్రానికి అందించాలని సూచించారు. ఈ ప్రక్రియ వేగంగా నిర్వహిస్తే మరణాలను పూర్తిగా నివారించడంతో పాటు వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు.నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయనున్నారు. ఉదయం 6నుంచి 11గంటల వరకూ మాత్రమే దుకాణాలు తెరుచుకుంటాయి. నరసరావుపేట, గురజాల, పిడుగురాళ్ల, తాడేపల్లి, మంగళగిరిలో ఉదయం 9గంటల వరకే దుకాణాలు తెరచి ఉంటాయి. కరోనా కట్టడి చర్యలపై వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయడు సమీక్ష నిర్వహించగా....ఈనెల 19 నుంచి 26 వరకు పూర్తిగా లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details