Leaders in YSRCP Plenary: తొలిరోజు వైకాపా ప్లీనరీలో నాలుగు తీర్మానాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఆమోదం తెలిపారు. మహిళా సాధికారత-దిశా చట్టం, విద్యారంగం, నవరత్నాలు, వైద్య రంగంపై తీర్మానాలకు వైకాపా ప్లీనరీ ఆమోదం తెలిపింది. ప్రైవేటు పాఠశాలకు పోటీగా ప్రభుత్వపాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నూతన విద్యావిధానంపై ఇప్పటికిప్పుడు ఫలితాలు రావని.. ఐదేళ్ల తర్వాత వాటి ఫలాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. విద్యారంగంలో సంస్కరణలకు సహకరించాలని ఉపాధ్యాయ సంఘాలను కోరుతున్నట్లు తెలిపారు. వైకాపా ప్లీనరీలో విద్యారంగంపై మంత్రి బొత్స తీర్మానం ప్రవేశపెట్టారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో అక్షరాస్యత శాతం పెరిగిందన్నారు.
మూడేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేసినట్లు మహిళా మంత్రులు అన్నారు. మహిళలు అన్నివిధాలా అండగా ఉంటూ వారి అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. మహిళా సాధికారత- దిశ చట్టం ప్లీనరీలో చేసిన తీర్మానంపై మహిళా మంత్రులు మాట్లాడారు. రాష్ట్రంలో మహిళా సాధికారత పరిపూర్ణంగా జరిగిందని మంత్రి ఉషాశ్రీచరణ్ అన్నారు. 'వైకాపా హాయాంలో మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో 78 లక్షల మంది మహిళలకు 12 వేల 757కోట్లు ఇచ్చారు. మహిళలందరికీ పోషకాహారం ఇస్తూ ఆరోగ్యంగా ఉండేలా సీఎం చర్యలు తీసుకున్నారు. 4 లక్షలమంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి ద్వారా రూ. 13 వేల కోట్లు ఇచ్చి తల్లులకు సాయం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత ఇస్తున్నారు. అభినవ పూలెగా జగన్ సేవ చేస్తుంటే... పథకాలు ఆపాలని మహానాడులో డిమాండ్ చేశారు. ఈ వర్గాల మహిళలకు పథకాలు అందకూడదని చంద్రబాబు ఉద్దేశమా?. పార్టీలకు అతీతంగా జగన్ పథకాలు అమలు చేస్తున్నారు. మరోసారి జగన్ను సీఎం చేసుకోవాలి' అని మంత్రి అన్నారు.