ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కోటప్పకొండ తిరునాళ్లు: ప్రభల వెలుగులపై పోలీసుల ఆంక్షలు - కోటప్పకొండ తిరునాళ్లు గుంటూరు జిల్లా

గుంటూరు జిల్లా కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభల వెలుగులకు ఈసారి పోలీసులు ఆంక్షలు విధించారు. శివరాత్రి సందర్భంగా ప్రభలు కట్టొద్దని హెచ్చరిస్తున్నారు. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రభలతో ఊరేగింపుగా వెళ్లటం సంప్రదాయంగా వస్తోంది. ఐతే ఎన్నికల కోడ్, కరోనా పేరిట ఈసారి ప్రభలను అనుమతించబోమని పోలీసులు చెప్పటం వివాదంగా మారింది. త్రికోటేశ్వరస్వామి భక్తులతో పాటు... తెదేపా, భాజపా నేతలు పోలీసుల తీరుని తప్పుబడుతున్నారు. ఏళ్ల తరబడి వస్తున్న సంప్రదాయాన్ని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

Kotappakoda
Kotappakoda

By

Published : Feb 27, 2021, 8:00 AM IST

కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభల వెలుగులకు పోలీసులు ఆంక్షలు

శివరాత్రి సందర్భంగా పరమశివున్ని విభిన్న రూపాల్లో ఆరాధించటం హిందూ సంస్కృతిలో భాగం. అదే క్రమంలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో.... ప్రభలు కట్టి ఊరేగించటం సంప్రదాయంగా వస్తోంది. ముఖ్యంగా కోటప్పకొండ ఆలయానికి సమీప ప్రాంతాల నుంచి భారీ ఎత్తులో ఉండే ప్రభలను తీసుకువస్తుంటారు. 50 నుంచి 100 అడుగుల ఎత్తులో ఉండే విద్యుత్ ప్రభలు కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ వెలుగులీనుతూ కనిపిస్తాయి. ప్రభలు కట్టే సంప్రదాయం తరాలుగాగా వస్తోంది. కోటిప్రభల రాకతో కోటయ్య కొండదిగి వచ్చి.... భక్తులను ఆశీర్వదిస్తారని నమ్మకం. అందుకే..... ప్రభలు ఆకట్టుకునేలా తయారు చేసేందుకు పోటీ పడుతుంటారు.

నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ ప్రాంతాల నుంచి ఎక్కువగా ప్రభలు వస్తుంటాయి. అందులో 70 శాతం పురుషోత్తపట్నం, కావూరు, కమ్మవారిపాలెం, మద్దిరాల, యడవల్లి, అప్పాపురం, అమీన్ సాహెబ్ పాలెం గ్రామాలకు చెందినవే ఉంటాయి. తిరునాళ్లకు ఒకటి, రెండు రోజుల ముందు రోజే ప్రభలు తమ గ్రామాల నుంచి బయలుదేరతాయి. తిరునాళ్లలో ప్రభలదే ప్రధాన ఆకర్షణ. అలాంటి ప్రభలు ఈసారి వద్దని పోలీసులు గ్రామాల్లోకి వెళ్లి చెబుతున్నారు. గ్రామాల్లో ఇప్పటికే ప్రభల తయారీ మొదలైంది. ఏళ్ల తరబడి వారసత్వంగా వస్తున్న సంప్రదాయాన్ని పోలీసులు అడ్డుకోవటం సరికాదని భక్తులు అంటున్నారు.

ప్రభలకు అనుమతిలేదని చెప్పటంపై భాజపా నేత కన్నా లక్ష్మినారాయణ మండిపడ్డారు. తెదేపా నేత, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. సూచనలు ఉంటే చెప్పాలే తప్ప.. ప్రభలు కడితే కేసులు పెడతామని బెదిరించడం సరికాదన్నారు. ప్రభలపై కొందరు రాజకీయ పార్టీల నేతల ఫొటోలు, గుర్తులు కూడా ఉంచుతారు. ప్రస్తుతం మున్సిపాలిటి ఎన్నికల కోడ్ ఉన్నందున అసలు ప్రభలు వద్దనేది పోలీసువర్గాల వాదన. అయితే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ముగిసినందున అక్కడ కోడ్ ఉండదు. అలాగే నరసరావుపేట మున్సిపాలిటి అయినా.. అక్కడ ఎన్నికలు జరగటం లేదు. కాబట్టి కోడ్ ప్రస్తావన రాదు. మరి ప్రభలు ఎందుకు వద్దనే అసలు కారణాలు మాత్రం పోలీసులు చెప్పడం లేదు.

ఇదీ చదవండి:

పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపుపై కేంద్ర జలశక్తిశాఖ అధ్యయనం

ABOUT THE AUTHOR

...view details