Kolikapudi Srinivasa Rao: రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పును అపహాస్యం చేసే విధంగా మంత్రులు, వైకాపా నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు మండిపడ్డారు. అమరావతి నుంచి తిరుపతికి కృతజ్ఞత పాదయాత్రను ఆయన మూడోరోజు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం నుంచి ప్రారంభించారు. రాష్ట్ర బడ్జెట్‌లో అమరావతికి నిధులు కేటాయించకపోవడంతోనే రాజధానిపై జగన్ వైఖరి ఏంటో తెలుస్తోందన్నారు.
"కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో అమరావతి అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకపోడవం.. రాజధాని విషయంలో సీఎం జగన్ వైఖరిని తెలియజేస్తోంది. న్యాయస్థానం తీర్పు ఇచ్చాక కూడా మంత్రులు, ప్రభుత్వ సలహాదారు.. ఆ తీర్పునకు వ్యతిరేకంగా, తీర్పును అసహాస్యం చేసేలా మాట్లాడిన మాటలను ప్రజలు విన్నారు. ఈ మూడేళ్లలో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఏ ప్రాంతంలోనూ ఎలాంటి అభివృద్ధి చేసిందిలేదు. గతంలో చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దని కోరుతున్నాం" -కొలికపూడి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు