వైకాపా ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు. ప్రజలంతా లాక్‌డౌన్‌తో ఇళ్లలో ఉన్న సమయంలో విద్యుత్ శ్లాబ్‌లు పెంచడం దుర్మార్గమని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల నూతన విధానానికి వ్యతిరేకంగా గుంటూరులో భాజపా నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని గంట పాటు నిరసనను చేపట్టారు. విద్యుత్ ఛార్జీలు, భూమలు అమ్మకాల జీవోలను వెనక్కి తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే విద్యుత్ శ్లాబ్‌లు మార్చే నిర్ణయం తీసుకుంటారా? అని కన్నా ప్రశ్నించారు. విద్యుత్ బిల్లులు పెంచలేదని ప్రభుత్వం చాలా తెలివిగా చెబుతోందన్నారు. శ్లాబ్ మార్పుతో పేద, మధ్యతరగతి వినియోగదారులు కూడా గ్రూపు-సీ లోకి మారిపోయారని తెలిపారు. గతంలో కంటే రెండు, మూడు రెట్లు బిల్లులు పెరిగాయని కన్నా ఆరోపించారు.
నేను కూడా మార్చి నెలలో రూ.11,541 చెల్లించాను. ఈ నెలలో రూ.20 వేలు బిల్లు దాటింది. ప్రభుత్వం మాత్రం బిల్లులు పెంచలేదని చెబుతుంది. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లో అన్ని ధరలు పెంచుతున్నారు. గుంటూరులో మార్కెట్ స్థలాన్ని ఏపీ బిల్డ్ కోసం అమ్మకానికి పెట్టడం దారుణం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే 66 ఏళ్ల వృద్ధురాలిపై కేసు పెడతారా?