ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్పీని కలిసిన జల్లయ్య కుటుంబీకులు... కేసులో వారి పేర్లు తొలగించాలని వినతి - Jallaiah Family met SP

Jallaiah's Family met SP: వైకాపా వర్గీయుల దాడిలో మృతి చెందిన తెదేపా కార్యకర్త జల్లయ్య కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిని కలిశారు. జల్లయ్య హత్యకేసులో సంబంధంలేని వారి పేర్లు తొలగించాలంటూ వినతి పత్రం సమర్పించారు.

Jallaiah's Family met SP
Jallaiah's Family met SP

By

Published : Jun 9, 2022, 8:47 PM IST

Jallaiah's Family met SP: పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడులో ఇటీవల వైకాపా కార్యకర్తల చేతిలో దాడికి గురై చికిత్స పొందుతూ మృతి చెందిన తెదేపా కార్యకర్త జల్లయ్య కుటుంబసభ్యులు గురువారం ఎస్పీ రవిశంకర్ రెడ్డిని కలిశారు. జల్లయ్య హత్యలో సంబంధం లేని ఇద్దరి పేర్లు నమోదు చేశారని, వాటిని తొలగించాలంటూ ఆయనకు వినతిపత్రం అందజేశారు. జల్లయ్య కేసును నీరు గార్చేందుకు పోలీసులు కేసుకు సంబంధం లేని... తమ ఇద్దరు బంధువులు కంచర్ల మంగయ్య, పెద్ద సైదయ్యల పేర్లు చేర్చారని వివరించారు. ఈ కేసు నుంచి వారి పేర్లు తొలగించి...తమకు న్యాయం చేయాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మృతుడు జల్లయ్య తల్లిదండ్రులు, భార్య ఎస్పీని కలిసి తమ వేదనను తెలిపారు.

అసలేం జరిగింది: తెలుగుదేశం కార్యకర్త జల్లయ్యను.. ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేశారు. 2019 తర్వాత వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక అధికార పార్టీ నేతల దాడులను తట్టుకోలేక... పల్నాడులో చాలా మంది తెలుగుదేశం సానుభూతిపరులు స్వగ్రామాలను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు. హతుడు జల్లయ్య కూడా స్వగ్రామం దుర్గి మండలం జంగమేశ్వరపాడు వదిలి గురజాల మండలంమాడుగులలో తలదాచుకుంటున్నారు. కుటుంబంలో పెళ్లి నేపథ్యంలో బ్యాంకు పనినిమిత్తం, శుభలేఖలు పంచేందుకు ఆయన దుర్గి వచ్చారు. అక్కడి నుంచి బొల్లాపల్లి మండలం రావులాపురానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో జంగమేశ్వరపాడు మీదుగా వస్తారని తెలుసుకున్న ప్రత్యర్థులు....గ్రామ సమీపంలోని మించాలపాడు అడ్డరోడ్డు వద్ద కాపు కాశారు.

ద్విచక్రవాహనంపై జల్లయ్యతో పాటు ఆయన బంధువులు ఎల్లయ్య, బక్కయ్య వస్తుండగా అడ్డగించి దాడి చేశారు. గాయపడిన ఎల్లయ్య, బక్కయ్యలు అటవీ ప్రాంతంలోకి పారిపోగా.....ప్రత్యర్థులు జల్లయ్యను జంగమేశ్వరపాడులోకి తీసుకొచ్చారు. గొడ్డళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈలోగా చుట్టుపక్కల వారు రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. అంబులెన్సులో మాచర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగా.....జల్లయ్య ప్రాణం విడిచాడు.

కొట్టి.. రూ.5 లక్షలు లాక్కెల్లారు :రావులాపురంలో శుభకార్యం కోసం పురోహితుడితో మాట్లాడి, బ్యాంకు నుంచి 5 లక్షలు తీసుకుని వెళ్తుంటే ప్రత్యర్థులు తమపై దాడి చేశారని....గాయపడ్డ ఎల్లయ్య, బక్కయ్య చెప్పారు. జంగమేశ్వరపాడుకు చెందిన పలువురు ఈ దాడిలో పాల్గొన్నారని.....కొట్టిన తర్వాత 5 లక్షలు లాక్కెళ్లారని చెప్పారు. ఘటనపై బక్కయ్య ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ముందు జాగ్రత్తగా గ్రామంలో డీఎస్పీ జయరాంప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు.

పథకం ప్రకారమే కార్యకర్తలపై దాడులు :పథకం ప్రకారమే ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చేసి హత్య చేయిస్తోందని.... మాచర్ల నియోజకవర్గ బాధ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి ధ్వజమెత్తారు. నరసరావుపేటలో జల్లయ్య మృతదేహాన్ని....స్థానిక తెలుగుదేశం నేత అరవిందబాబుతో కలిసి ఆయన పరిశీలించారు. హత్యా రాజకీయాలు మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అరవిందబాబు హెచ్చరించారు.

డీజీపీకి చంద్రబాబు లేఖ :పల్నాడులో హత్యా రాజకీయాలపై డీజీపీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. జల్లయ్య హత్య కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్థానిక వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి....పోలీసులు అనుకూలంగా వ్యవహరించడంతోనే పల్నాడులో శాంతి భద్రతలు గాడి తప్పాయని ఆక్షేపించారు. తోట చంద్రయ్య హత్య తర్వాతా పోలీసులు మేల్కోపోవడం దారుణమన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు, కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు.....ముగ్గురు సభ్యుల బృందం జంగమేశ్వరపాడు వెళ్లనుంది.కొల్లు రవీంద్ర, బీద రవిచంద్ర, బుద్ధ వెంకన్న ఈ బృందంలో ఉన్నారు. వీరితో పాటు జిల్లా ముఖ్య నేతలూ జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొంటారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details