Roads Digging Problem: అడుగడుగునా గుంతలు.. అడ్డగోలుగా తవ్వకాలు.. రోడ్డు మధ్యలోనే ఎత్తుగా మట్టికుప్పలు.. కాలు బయటపెట్టాలంటేనే చిరాకుపడేలా ఉన్న ఆ మార్గంలో వాహనాలపై ప్రయాణమంటే ప్రమాదకరంగా మారిన పరిస్థి. ఇది గుంటూరు జిల్లా మంగళగిరిలో అంతర్గత రహదారుల పరిస్థితి. తాగునీటి పైపులైన్లు వేసేందుకు రోడ్లు తవ్వేసి వదిలేయడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. నిధుల విడుదల చేయకపోవడంతో గుత్తేదారులు మధ్యలోనే పనులు నిలిపివేశారు.
3 నెలల క్రితం తవ్విన రోడ్లు: గుంటూరు జిల్లా మంగళగిరిలో అంతర్గత రోడ్లు ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. బాప్టిస్ పేట, భార్గవపేట, పాత మంగళగిరి, కొప్పురావుకాలనీ, సాయినగర్ ప్రాంతాలలో తాగు నీటి పైప్ లైన్ల కోసం చేపట్టిన పనులు పూర్తి చేయకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుత్తేదారు మధ్యలోనే పనులు వదిలేసి వెళ్లిపోవడంతో.. 3 నెలల క్రితం తవ్విన రోడ్లు ఇంకా బాగు చేయలేదు. రోడ్డు మధ్యలో తవ్వడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.