మిర్చి ఎక్కువగా సాగయ్యే గుంటూరు జిల్లాలో... పంట నిల్వ కోసం శీతల గోదాములు ఎక్కువగా ఉన్నాయి. గుంటూరు జిల్లా మొత్తం కలిపి 120కి పైగా గోదాములు ఏర్పాటయ్యాయి. గోదాముల సామర్థ్యం మేరకు రోజుకు 800 నుంచి 1000 యూనిట్ల వరకు కరెంటు వినియోగిస్తుంటారు. ఒక్కో యూనిట్‌కు రూ.6.50 చొప్పున విద్యుత్ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రకారం ఒక గోదాము యజమాని నెలకు లక్ష నుంచి రూ. 4 లక్షల రూపాయల మేర కరెంటు బిల్లుల కోసం ఖర్చు చేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా సౌర ఫలకాలు అమర్చుకుంటే బిల్లుల నుంచి కొంతమేర ఉపశమనం లభిస్తుంది. శీతలగోదాముపై ఉన్న స్థలంలో 150 కిలోవాట్లకు పైగా సౌరపలకలు ఏర్పాటు చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు.
సౌర ఫలకాలతో నెలకు 15వేల యూనిట్లు
జిల్లాలో ఇప్పటికే 3 శీతల గోదాముల యజమానులు ముందుకొచ్చి సౌర పలకలు ఏర్పాటు చేసుకోగా మరికొందరు దరఖాస్తు చేసుకున్నారు. ఒక శీతలగోదాముపై 120 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ యూనిట్ ఏర్పాటు చేయవచ్చు. తద్వారా రోజుకు 500 యూనిట్ల వరకు విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. అంటే నెలకు 15వేల యూనిట్లు వస్తుంది. నెలవారీగా వచ్చే విద్యుత్ బిల్లులో ఆ మేరకు వినియోగం తగ్గించి... మిగతా బిల్లు చెల్లిస్తే సరి. తమ శీతల గోదాముపై ప్లాంటు ఏర్పాటు చేయగా.... నెలకు రూ.90వేల వరకు బిల్లులో ఆదా అయినట్లు దాని యజమాని తెలిపారు. యూనిట్ ఏర్పాటుకు రూ.48లక్షలు ఖర్చయింది. బ్యాంకు నుంచి రుణం పొందవచ్చు. ఇప్పుడు విద్యుత్తు బిల్లు రూపంలో మిగులుతున్న సొమ్మును నెలవారీగా బ్యాంక్ వాయిదాలు చెల్లించడానికి ఉపయోగిస్తున్నట్లు ఆయన వివరించారు. ఐదేళ్ల తర్వాత రుణం తీరిపోతుందని.. అప్పటినుంచి 20 ఏళ్ల పాటు విద్యుత్తు బిల్లుల రూపంలో సొమ్ము ఆదా కానుందని తెలిపారు. శీతలగోదాములో సరకు లేని సమయంలో ప్లాంటు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను అమ్ముకునే వెసులుబాటు ఉంది. ఇది కూడా గోదాముల యజమానులకు కలిసొచ్చే అంశం.
రాయితీ ఇస్తున్న ఉద్యానశాఖ