ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరుకు చెందిన.. దొండపాటి పవన్ అలియాస్ పల్లా వెంకటేశ్వర్లు, దొండపాటి ప్రభావతి భార్యభర్తలు. వీరిద్దరూ సంతమాగులూరు మండలం కొప్పరంలో 4 ఎకరాల 73 సెంట్ల ఆస్తి పూర్వీకుల నుంచి సంక్రమించినట్లుగా.. కొన్నేళ్ల క్రితం నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు పొందారు. వీరికి అప్పటి సంతమాగులూరు తహసీల్దారు.. చిన మల్లికార్జునరావు, వీఆర్వో సరిమల్ల జ్యోతిబాబు సహకరించారు. 2020లో ఈ దంపతులు.. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామానికి చెందిన వారిగా ఆధార్ కార్డులు మార్చుకుని.. నకిలీ పట్టాలతో రుణం కోసం.. ఉప్పలపాడులోని చైతన్య గోదావరి బ్యాంకును సంప్రదించారు. ఈ దంపతులు ఇద్దరూ అన్నాచెల్లెళ్లుగా.. అదే గ్రామానికి చెందిన కర్రావుల మునయ్యతో మేనేజరుకు చెప్పించి నమ్మించారు. బ్యాంకు మేనేజరు కూడా.. సంతమాగులూరు ఎమ్మార్వో కార్యాలయంలో విచారించగా.. ముందస్తు ఒప్పందం ప్రకారం ఆ భూమి వారిదేనని ఎమ్మార్వో తెలిపారు. దీంతో పాసుపుస్తకాలు తనఖా పెట్టుకుని బ్యాంకు మేనేజరు క్రాప్ లోన్ కింద రూ.9 లక్షలు మంజూరు చేశారు.
ఏడాది గడుస్తున్నా రుణం తిరిగి చెల్లించకపోవడంతో.. బ్యాంకు మేనేజర్ వారిని ఆరా తీశారు. అనుమానం వచ్చి విచారించగా.. మోసం వెలుగులోకి వచ్చింది. మేనేజర్ ఫిర్యాదుతో నరసరావుపేట పోలీసులు.. దంపతులిద్దరినీ విచారించగా ఈ విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వారి నుంచి రూ.9 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు.