రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడే వారిని చూస్తూ ఊరుకోబోమని, సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత(home minister sucharitha on tdp leader pattabhi comments on cm jagan ) హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు, వీడు, పాలెగాళ్లు అని సంబోధిస్తూ తెదేపా నేత పట్టాభి మాట్లాడితే ఏనాడూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు అలాంటి వ్యాఖ్యలు సరికాదని మందలించలేదు. గుజరాత్ పోర్టులో దొరికిన డ్రగ్స్ విషయంలో సీఎం, వైకాపా నాయకులపై పదేపదే బురదజల్లుతున్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని కేంద్రం స్పష్టత ఇచ్చినా సీఎంను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అందుకే వారిది ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్న దుష్ప్రచారంగా అనిపిస్తోంది. తెదేపా కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి వెనుక ఆ పార్టీ నేతల హస్తం ఉండొచ్చని అనుమానించాల్సి వస్తోంది. ప్రజాస్వామ్యంపై దాడి అంటూ చంద్రబాబు, దాడులను ఖండిస్తున్నామని మరికొందరు అంటున్నారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని పాలెగాడు అంటే చంద్రబాబుతో సహా వీరెవరూ ఖండించకపోవడం బాధాకరం" అని అమె అన్నారు.
"నాకు అంబ్కేడర్ ఆదర్శమని పదేపదే మాట్లాడే ఒకాయన ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను కనీసమైనా ఖండించలేదు. డీజీపీకి ఫోన్ చేసినా స్పందించలేదని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆ సమయంలో ఆయన పోలీసు అమరవీరుల దినోత్సవ సన్నాహక సమావేశంలో ఉన్నారు. ఏఓబీలో గంజాయి సాగు ఎప్పటి నుంచో ఉంది. గంజాయికి కేరాఫ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను మారుస్తున్నారని, విద్యార్థులను డ్రగ్స్‌కు బానిసలుగా చేస్తున్నారని ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. జేఈఈ ర్యాంకుల ప్రకారం చూస్తే 50 మంది గిరిజన విద్యార్థులకు ఐఐటీలో, 250 మందికి ఎన్‌ఐటీలలో ప్రవేశాలు వచ్చే అవకాశముంది. పిల్లలను డ్రగ్స్‌కు బానిసలుగా చేస్తే గొప్పగొప్ప విద్యా సంస్థల్లో ఇన్ని సీట్లు ఎలా వస్తాయో ఆలోచించుకోవాలని’ సుచరిత ప్రశ్నించారు.