అగ్రిగోల్డ్ కుంభకోణం చంద్రబాబు హయాంలో జరిగితే బాధితులకు వైకాపా ప్రభుత్వం న్యాయం చేస్తోందని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్.. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటున్నారని హోంమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు గుంటూరులోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. పదివేలలోపు డిపాజిట్లు చేసిన వాళ్లకు మొదటి విడతగా రూ. 269 కోట్లు చెల్లించారని గుర్తుచేశారు. రూ. 10 నుంచి రూ. 20 వేలలోపు డిపాజిట్లు చేసిన వారి ఖాతాల్లో మంగళవారం సీఎం జగన్ జమ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో మూడు లక్షల మందికిపైగా అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట కలుగుతుందన్నారు. రూ. 20 వేలకుపైగా డిపాజిట్లు చేసిన వారికి త్వరలో న్యాయం చేస్తామని చెప్పారు.
కనీసం సెబీ అనుమతి లేకుండానే అగ్రిగోల్డ్ సంస్థ రూ. 6వేల 500కోట్ల డిపాజిట్లు వసూలు చేసిందన్నారు. చంద్రబాబు హయాంలో అగ్రి గోల్డ్ బాధితులను పట్టించుకోకపోగా హాయ్‌లాండ్‌ను అగ్రిగోల్డ్ ఆస్తి కాదని చెప్పించారని ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద పెట్టుబడులు పెట్టే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.