గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య అనంతరం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గుంటూరులో తెదేపా నేతల ఆందోళనలు, వైకాపా నేతల అడ్డగింతలతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మృతురాలి కుటుంబసభ్యులను జీజీహెచ్‌లో హోంమంత్రి సుచరిత పరామర్శించారు. ప్రభుత్వం తరపున రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. అందుకు సంబంధించిన చెక్కును రమ్య కుటుంబ సభ్యులకు హోం మంత్రి అందించారు. మరోవైపు దళిత యువతి రమ్య హత్యను నిరసిస్తూ.. గుంటూరు జీజీహెచ్ వద్ద పలు సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. శవ పరీక్ష పూర్తైన రమ్య మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు కుటుంబసభ్యుల యత్నించగా.. ప్రజాసంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు. రమ్యను హత్య చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని రోడ్డుపై బైఠాయించి డిమాండ్ చేశారు. రమ్య కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలన్నారు. ఆందోళనకారుల నుంచి తప్పించుకుని.. రమ్య మృతదేహాన్ని ఆస్పత్రి వెనుక ద్వారం నుంచి పోలీసులు ఆమె స్వగ్రామం చిలుమూరు తరలించారు.
నారా లోకేశ్ అరెస్టు...
గుంటూరులో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. గుంటూరు పరమయ్యగుంటలో రమ్య కుటుంబీకులను ఓదార్చిన లోకేశ్... వాళ్లకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇంట్లోని మహిళలకే ముఖ్యమంత్రి రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నారని విమర్శించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. రాజకీయ లబ్ధికోసమే లోకేశ్ వచ్చారంటూ వైకాపా శ్రేణులు అక్కడికి చేరుకొని ఆరోపించాయి. ఈ క్రమంలో తెదేపా-వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోటాపోటీ నినాదాలతో శ్రేణులు ఆరోపణలు చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నాలు చేపట్టారు. ఈ క్రమంలో లోకేశ్‌తో పాటు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారు. లోకేశ్‌ను ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మిగతా నేతలను వివిధ ప్రాంతాల్లోని స్టేషన్లకు తీసుకెళ్లారు.
151 సీఆర్పీసీ కింద అభియోగాలు నమోదు...
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఎప్పుడు విడుదలవుతారన్న దానిపై స్పష్టత రావడం లేదు. ఇవాళ మధ్యాహ్నం లోకేశ్‌ను అరెస్టు చేసి ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఆయన్ని వెంటనే విడుదల చేయాలంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5.30 తర్వాత వేరే వాహనంలో లోకేశ్‌ను పోలీసులు స్టేషన్ నుంచి తీసుకెళ్లిపోయారు. అనంతరం ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్ నుంచి లోకేశ్‌ను పెదకాకాని పీఎస్‌కు తరలించారు. లోశ్‌ను తన కాన్వాయ్‌లోనే పొన్నూరు చుట్టుపక్కల డొంక రోడ్డుల్లో పోలీసులు తిప్పారు. పెదకాకాని పోలీస్ స్టేషన్లో లోకేశ్‌తో సంతకం పెట్టించుకుని విడుదల చేశారు.
రాజకీయం చేయడం తగదు...