గుంటూరులోని జిల్లా జైలు వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి ప్రాంతంలోని దళిత రైతులపై కేసులు పెట్టడం, బేడీలు వేసి జైలుకు తీసుకురావటాన్ని నిరసిస్తూ అమరావతి ఐకాస 'జైలు భరో' నిర్వహించింది. తెలుగుదేశం, సీపీఐతో పాటు పలు ప్రజాసంఘాలు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపాయి. ఆరేళ్ల చిన్నారి నుంచి అరవై ఏళ్ల వృద్ధురాలి వరకూ ఆందోళనలో పాల్గొని జై అమరావతి అంటూ నినదించారు. పోలీసుల ఆంక్షలను దాటుకుని ఐకాస నేతలు జైలును ముట్టడించారు. రైతు ఐకాస నేత పువ్వాడ సుధాకర్, రాజకీయేతర ఐకాస నేతలు మల్లిఖార్జున, మహిళా ఐకాస నేత శైలజ, ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీనివాస్, కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ, సీపీఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు జైలు వద్ద ఆందోళనకు దిగారు. మహిళలు రోడ్డుపై బైఠాయించారు. జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు.
పోలీసుల వలయాన్ని ఛేదించి...
'జైలు భరో'ను అడ్డుకోవడానికి గుంటూరు జిల్లాలోని ఐకాస నేతలు, రాజకీయ పార్టీల వారిని ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు పోలీసులు. నాయకుల ఇళ్ల ముందు సిబ్బందిని మోహరించారు. రాజధాని గ్రామాల్లో భారీగా బలగాలను దించారు. అక్కడినుంచి గుంటూరు వెళ్లే మార్గంలో 10 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. జిల్లా జైలుకు ఎవరినీ వెళ్లనీయకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. మరోవైపు గుంటూరు జిల్లా జైలు వద్ద వందలాది మంది పోలీసులు వలయంగా ఏర్పడ్డారు. పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నా ఆందోళనకారులు జైలు వద్దకు చేరుకున్నారు. ఒకరిద్దరితో మొదలైన ముట్టడి కార్యక్రమం వందలాది మంది వరకూ వెళ్లింది. రైతులు, మహిళలు, రాజకీయ పక్షాల నేతలు విడతల వారీగా జైలు వైపు దూసుకువచ్చారు. ప్రధాన రహదారి నుంచి జైలు లోపలకు వెళ్లనీయకుండావారిని పోలీసులు నిలువరించారు. బలవంతంగా అరెస్టు చేశారు.
ఈడ్చుకుంటూ వెళ్లి..
రైతు ఐకాస కన్వీనర్ సుధాకర్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా మహిళలు రక్షణ వలయంగా ఏర్పడ్డారు. ముందుగా పోలీసులు ఆందోళనకారులను వాహనాల్లోకి ఎక్కించాలని చూసినా సాధ్యం కాలేదు. మహిళా పోలీసులు బలవంతంగా వారిని వాహనాల్లో ఎక్కించారు. ఈ క్రమంలో తీవ్ర పెనుగులాటలు జరిగాయి. కొందరు మహిళలకు గాయాలయ్యాయి. మహిళా ఐకాస నేత శైలజను ఈడ్చుకుంటూ వెళ్లారు. పోలీసుల చర్యలను ఐకాస నేతలు, రైతులు ఖండించారు. ఉద్యమాన్ని అరెస్టులతో అడ్డుకోలేరని స్పష్టం చేశారు.