వ్యాపారులు, రైతులు, కూలీలతో నిత్యం సందడిగా ఉండే గుంటూరు మిర్చి యార్డులో శుక్రవారం హైడ్రామా జరిగింది. యార్డులో కమిషన్ వ్యాపారం నిర్వహించే శేఖర్ రెడ్డి అనే వ్యక్తిని కొందరు బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించటం కలకలం రేపింది. తోటి వ్యాపారులు, కూలీలు వారిని అడ్డుకున్నారు. మాచర్ల ఎమ్మెల్యే అనుచరుడు మేకల శ్రీనివాసరెడ్డే తనను కిడ్నాప్ చేసేందుకు యత్నించారని.. బాధితుడు శేఖర్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే అండతో శ్రీనివాసరెడ్డి తన భర్తను చంపేందుకు యత్నిస్తున్నారని శేఖర్ రెడ్డి భార్య హరిత ఆరోపించారు. గతంలో అతనిపై తాము లాలాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. 6 నెలలుగా తన భర్తను హతమార్చేందుకు కొందరు యత్నిస్తున్నారని చెప్పారు.
'కిడ్నాపర్లు కాదు.. పోలీసులే'
ఈ ఘటనపై పోలీసుల వాదన మరోలా ఉంది. ఇది కిడ్నాప్ వ్యవహారం కాదని నగరంపాలెం సీఐ మల్లికార్జున మీడియాకు తెలిపారు. వ్యాపారి శేఖర్ రెడ్డి పైన మేకల శ్రీనివాసరెడ్డి ఫిర్యాదుతో కారంపూడి పోలీసు స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైందని వెల్లడించారు. ఆ కేసులో శేఖర్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు మిర్చి యార్డుకు వచ్చారని.. మఫ్టీలో ఉండటంతో వ్యాపారులు, కూలీలు వారిని అడ్డుకున్నట్లు చెబుతున్నారు. అయితే పోలీసుల వాదనను బాధితుడు శేఖర్ రెడ్డి తోసిపుచ్చారు. తనపైన కారంపూడిలో కిడ్నాప్ కేసు ఉందంటున్న పోలీసులు... ఎవరిని కిడ్నాప్ చేశానో మాత్రం చెప్పటం లేదన్నారు.