దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 74 ఏళ్ల తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో మృతదేహాలకు దహనసంస్కారాలు చేయడానికి శ్మశానవాటిలు, శవదహనశాలలు లేక ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కోవడం దురదృష్టకరమని హైకోర్టు పేర్కొంది. రాజ్యాంగం 21వ అధికరణ ప్రసాదించిన జీవించే హక్కులో భాగంగా మనిషి బతికున్నప్పుడే కాకుండా మరణించాక కూడా మృతదేహానికి గౌరవమర్యాదలు, హుందాతనం ఉంటాయని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పినట్లు గుర్తుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం, స్థానికసంస్థలు ఈ వ్యవహారాన్ని తీవ్రమైన అంశంగా పరిగణించి కులమత, ప్రాంత విభేదాలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ అవసరమైన శ్మశానవాటికలు సమకూర్చి పెడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకునేందుకు తీర్పు ప్రతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. తగిన శ్మశానవాటిక/శవదహనశాల లేక ఎస్సీలు పెదకాకానిలో చెరువుగట్టుపై అంతిమ సంస్కారాలు చేయడంపై గ్రామస్థులు అభ్యంతరం తెలుపుతున్నారని తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. గుంటూరు జిల్లా పెదకాకానిలో శ్మశానవాటికకు చెందిన సర్వే నంబరు 153 స్థలంలో సర్వే చేయాలని అధికారులను ఆదేశించింది. శ్మశానవాటిక స్థలం ఆక్రమణకు గురైతే ఆక్రమణదారుల్ని తక్షణం ఖాళీ చేయించి, ఆ స్థలాన్ని ఎస్సీ సామాజికవర్గ ప్రజల శ్మశానం కోసం కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలంది. నాలుగు వారాల్లో సర్వే చేయాలని అధికారులకు తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు ఇటీవల కీలక తీర్పు ఇచ్చారు.
నేపథ్యమిది..
పెదకాకాని సర్వేనంబరు 153లోని హిందూ శ్మశానవాటిక భూమిలో కొంత స్థలాన్ని క్రైస్తవ శ్మశానవాటికకు కేటాయించేందుకు అధికారులు ప్రతిపాదించడాన్ని సవాలు చేస్తూ జి.రత్తయ్య, మరో 8మంది హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వారి తరఫు న్యాయవాది వాదిస్తూ.. పిటిషనర్లు వ్యవసాయదారులని చెప్పారు. సర్వేనంబరు 153లో 95 సెంట్ల శ్మశానస్థలం ఉండగా.. 71 సెంట్లే లభ్యంగా ఉందన్నారు. కాలువ, గట్లకు స్థలం పోగా మిగిలినదాంట్లో ప్రహరీ కట్టామన్నారు. క్రైస్తవ శ్మశానవాటిక కోసం 153 సర్వే నంబరులోని స్థలాన్ని కేటాయిస్తే తమ పొలాలకు వెళ్లేందుకు మార్గం ఉండదన్నారు. పెదకాకాని తహశీల్దార్ కౌంటర్ దాఖలుచేస్తూ.. రెవెన్యూ రికార్డు ప్రకారం సర్వేనంబరు 153లో 95 సెంట్లు ప్రభుత్వ పోరంబోకు అని, అందులోని 71 సెంట్లలో హిందూ శ్మశానవాటిక ఉందన్నారు. ఆ స్థలానికి ప్రహరీ నిర్మించారన్నారు. మిగిలిన 24 సెంట్ల శ్మశానం భూమిని రత్తయ్య ఆక్రమించారన్నారు. పక్కనున్న సొంతభూమితో కలిపి ఈ స్థలాన్ని సాగు చేస్తున్నారన్నారు. ఎస్సీ సామాజికవర్గం వారి శ్మశానం కోసం ఆ 24 సెంట్లను గుర్తించామన్నారు. పెదకాకానిలో ఎస్సీలకు 50 ఏళ్లుగా శ్మశానం లేకపోవడంతో, స్థలం కేటాయించాలని వారు కోరారన్నారు.