సాధారణంగా కిలో 20 లోపు ఉండే ఉల్లి ధర గుంటూరు మార్కెట్లో ఇప్పుడు రూ. 75 నుంచి 80 కి చేరుకుంది. ఉల్లి ఉత్పత్తికి ప్రధానమైన మహారాష్ట్ర మార్కెట్లో టోకున కిలో 60 నుంచి 100 రూపాయల ధర పలుకుతోంది. అక్కడి నుంచి రవాణా, తరుగు, కమీషన్, ఇతర ఖర్చులు కలిపి కిలోకు 10 వరకు ఖర్చవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇవి రిటైల్ మార్కెట్లోకి వచ్చి విక్రయించే సరికి మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు.
భారీ వర్షాలే కారణం
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో వరదల వల్ల ఉల్లి పంట ముంపునకు గురైంది. గుంటూరు జిల్లాకు ఎక్కువగా మహారాష్ట్రలోని షోలాపూర్, పూనే, అహమ్మద్ నగర్, నాసిక్ తదితర మార్కెట్ల నుంచి ఉల్లి దిగుమతి అయ్యేవి. సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెలల్లో కర్నూలుతో పాటు కర్ణాటక నుంచి ఉల్లి స్థానిక మార్కెట్కు వస్తాయి. సగటున మూడు నెలలు మినహా...మిగిలిన కాలమంతా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి జిల్లాకు ఉల్లిపాయలు దిగుమతి అవుతాయి. కర్ణాటకలో ఈసారి వరదల వల్ల పంట పెద్దఎత్తున దెబ్బతింది. మహారాష్ట్రలో ప్రస్తుతం మార్కెట్కు కొత్త పంట రావాల్సి ఉండగా...వర్షాలకు పాడైంది. దీంతో నిల్వ ఉన్న సరకుకు డిమాండ్ అమాంతం పెరిగింది. సరకు లభ్యత తగ్గిపోవడం.., వరదల తర్వాత ఒక్కసారిగా అన్ని ప్రాంతాల నుంచి ఉల్లిపాయలు కావాలని ఆర్డర్లు రావడంతో రోజుల వ్యవధిలోనే ధరలు పెరిగాయి.