ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KRISHNA RIVER: కృష్ణమ్మ పరుగులు.. రాష్ట్రంలో జలాశయాలకు జలకళ

కృష్ణా నదిలో వరద ప్రవాహానికి రాష్ట్రంలోని జలాశయాలు నిండాయి. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. డ్యాముల వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా తీరప్రాంత గ్రామాలకు వరద తాకిడి పెరగడంతో..అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు.

heavy flood flows to krishna river
జలాశయాలకు జలకళ

By

Published : Aug 2, 2021, 2:46 PM IST

జలాశయాలకు జలకళ

సాగర్ 22 క్రస్టు గేట్ల ద్వారా నీటి విడుదల

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పెరుగుతుండటంతో 22 క్రస్టు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పైనుంచి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు పర్యాటకులు సాగర్​కు పోటెత్తుతున్నారు. 22 క్రస్టు గేట్ల ద్వారా 10 ఫీట్ల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3,72,282 క్యూసెక్కులు కాగా..ఔట్ ఫ్లో 3,55,727 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 587.20 అడుగులు మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 305.6242 టీఎంసీలుగా ఉంది. అచ్చంపేట మండలం మాదిపాడు-జడపల్లి తండా మధ్య రహదారి పైకి వరదనీరు నీరు చేరుకుంది. పులిచింతలకు వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

నదీ పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..మత్స్యకారులు వేటకు, మహిళలు బట్టలు ఉతకడానికి వెళ్లొద్దని అధికారులు సూచించారు. నదీ తీరంలోని గొడ్ల, గొర్రెల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

కృష్ణా నది పరివాహక ప్రాంతం మండలాలైన మాచర్ల, రెంటచింతల, గురజాల, దాచేపల్లి, మాచవరం మండలాల తహసీల్దార్​లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. దాచేపల్లి మండలం రామాపురంలో ఉన్న 48 మత్స్యకార కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వెల్లంపల్లి, భోధనం, కేతవరం గ్రామాలను ఖాళీ చేయించారు. పులిచింతల బ్యాక్ వాటర్ వరద వల్ల ఎవరైనా ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటే సంబంధిత రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని ఉన్నతాధికారులు కోరారు.

శ్రీశైలానికి తగ్గిన వరద

నాలుగు రోజులుగా ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహానికి కృష్ణా నదిపై ఉన్న జలాశయాలు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుండగా.. ప్రస్తుతం జలాశయంలోకి 4 లక్షల 390 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి.. 4 లక్షల 67 వేల 451 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 3 లక్షల 51 వేల 622 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 48 వేల 768 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టు వైపు వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.80 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 208.72 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

పులిచింతలకు వెళ్లే మార్గంలో నిలిచిన రాకపోకలు

గుంటూరు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3 లక్షల 23 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 17 గేట్లను ఎత్తి.. 3 లక్షల 47వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 45.77టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 41.38 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. కృష్ణా తీరప్రాంత గ్రామాలకు వరద తాకిడి పెరగడంతో.. అచ్చంపేట మండలం మాదిపాడు-జడపల్లితండా మధ్య రహదారిపైకి వరదనీరు చేరుకుంది. పులిచింతలకు వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచాయి.

ప్రకాశం బ్యారేజీ నుంచి లక్షా 10 వేల కూసెక్కుల నీరు సముద్రంలోకి..
ప్రకాశం బ్యారేజీ నుంచి లక్షా 10 వేల కూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు జలవనరులశాఖ ఈఈ రాజస్వరూప్ కుమార్ తెలిపారు. ప్రకాశం బ్యారేజి 70 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నట్లు తెలిపారు. మరో మూడు లక్షల 50 వేల క్యూసెక్కుల నీరు పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రకాశం బ్యారేజీలో పూర్తిస్థాయి నీటిమట్టం 3.07 టీఎంసీలు ఉంచుతూనే..నీటిని సముద్రంలోకి వదులుతున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి.

krishna water disputes : కృష్ణా జలాల వివాదం.. ఏపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ

ABOUT THE AUTHOR

...view details