సీట్లు, ఓట్ల కోసం ముగిసిన పోరాటం: ఇక పదవుల వంతు..! గుంటూరు నగరపాలక సంస్థలో... సీట్ల కోసం, ఓట్ల కోసం పోరాటం ముగిసింది. ఇక పదవుల కోసం పోటీ మొదలైంది. గుంటూరు నగరపాలక సంస్థలోని 57 డివిజన్లలో వైకాపాకు 44 సీట్లు వచ్చాయి. ఎక్స్ అఫిషియో సభ్యుల మద్దతు అవసరం లేకుండానే ఆ పార్టీ అభ్యర్థి మేయర్ కానున్నారు. జనరల్ కావటంతో ఎవ్వరైనా మేయర్ సీటుకు పోటీ పడే అవకాశం ఉంది. ఎన్నికల సమయం నుంచి ఇద్దరి ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. పార్టీ ముఖ్యనేతలు మేయర్ ఎవరికి ఇవ్వాలనే అంశంపై చర్చించారు. కావటి మనోహర్ నాయుడు, పాదర్తి రమేష్ గాంధీ, చంద్రగిరి కరుణకుమారి మేయర్ పదవి కోసం పోటీపడ్డారు.
వీరందరిలో ఎవరికి వారు మేయర్ తామేనని ఊహల్లో ఉన్నారు. కావటి మనోహర్ నాయుడుకు 2014, 19లో పెదకూరపాడు అసెంబ్లీ టికెట్ చేజారింది. అప్పట్లోనే కావటికి న్యాయం చేస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు. ఆ మేరకు మేయర్ పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కావటి భావిస్తున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన మనోహర్ నాయుడుకు మున్సిపల్ మంత్రి బొత్స ఆశీస్సులు ఉన్నాయి. వైకాపా నగరపార్టీ అధ్యక్షులు, వైశ్య సామాజికవర్గానికి చెందిన పాదర్తి రమేష్ గాంధీ మేయర్ పదవి కోసం పట్టుబడుతున్నారు.
నగరంలో వైశ్య సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతో వారి నుంచి వ్యతిరేకత రావద్దనే ఉద్దేశంతో మేయర్ పదవి ఎవరికనేది ముందుగా ప్రకటించలేదు. అంతర్గతంగా మాత్రం చెరో రెండున్నరేళ్లు పదవి ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో రమేష్ గాంధీ 6వ డివిజన్లో, మనోహర్ నాయుడు 20వ డివిజన్లో గెలుపొందారు. ఐదేళ్లు చెరో సగం పంచుకున్నా... ముందుగా ఎవరికిస్తారనేది ఆసక్తిగా మారింది. కావటి ఐదేళ్లు తనకే కావాలని అడుగుతున్నారు. పాదర్తి రమేష్ గాంధీ మాత్రం సగం కాలమైనా ఫర్వాలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం శిరోధార్యమని ఇద్దరు నేతలు చెబుతున్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్, మిర్చియార్డు మాజీ ఛైర్మన్ చంద్రగిరి ఏసురత్నం తన భార్య కరుణకుమారికి మేయర్, లేదా డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. బిసీ సామాజికవర్గం, మహిళ కావటం ఆమెకు కలిసొచ్చే అంశం. నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న మైనార్టీలు ముఖ్యమైన పదవి ఆశిస్తున్నారు. మేయర్ లేదా డిప్యూటీ మేయర్ పదవి దక్కుతుందని భావిస్తున్నారు. మైనార్టీల్లో ముగ్గురు, నలుగురు కార్పొరేటర్లు పదవుల కోసం పోటీలో ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం నుంచి పదవుల కోసం పోటీ ఉంది. 8మంది ఆ వర్గం వారు కార్పొరేటర్లుగా గెలిచారు. కనీసం డిప్యూటీ మేయర్ అయినా దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇలా భిన్నమైన సామాజిక సమీకరణలు మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎంపికలో ప్రామాణికం కానున్నాయి.
ఇదీ చదవండీ... గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎగిరిన వైకాపా జెండా