ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నిబంధనల ప్రకారం వారిని వెంటనే అనుమతించలేం'

ఆంధ్రా - తెలంగాణ సరిహద్దుల్లోని చెక్​పోస్టుల వద్ద ప్రజల పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్ నుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకున్నా.. ఏపీలోకి పోలీసులు అనుమతించడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు వేల మందికిపైగా సరిహద్దు వద్ద చిక్కుకున్నారు. ఈ సమస్యపై స్పందించిన అధికారులు... సరిహద్దులకు వైద్య బృందాలను పంపుతున్నామని... నిబంధనల ప్రకారం వారిని వెంటనే ఊర్లలోకి అనుమతించేది లేదని స్పష్టం చేస్తున్నారు.

hardships of the people at andhra telangana borders over not allowed in ap
hardships of the people at andhra telangana borders over not allowed in ap

By

Published : Mar 26, 2020, 10:25 AM IST

ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో ప్రయాణికుల అడ్డగింత

హైదరాబాద్‌ నుంచి రాత్రి బయల్దేరిన వారంతా తెల్లవారుజాముకు గరికపాడు చెక్‌పోస్టు, దామరచర్ల తదితర సరిహద్దు ప్రాంతాలకు చేరుకోగానే చెక్‌పోస్టుల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం.. వారందరినీ వెంటనే రాష్ట్రంలోకి అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వైద్యపరీక్షలు నిర్వహించి స్వగ్రామాలకు పంపించాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు. ప్రయాణికులు భారీగా చేరుకుంటుండగా.. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గరికపాడు చెక్‌పోస్టు సమీపంలో దాదాపు రెండు వేల మంది ప్రయాణికులు నడిరోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. చిన్న పిల్లలతో బయల్దేరిన వారు రోడ్డుపైనే కూర్చుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వైద్య బృందాలను పంపుతున్నాం: గుంటూరు జేసీ

సరిహద్దుల్లో ఆగిపోయిన వారి ఇబ్బందులపై గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ స్పందించారు. ఏపీ, తెలంగాణ సరిహద్దులకు వైద్య బృందాలను పంపిస్తున్నట్టు చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తామని వెల్లడించారు. సరిహద్దుల్లో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నల్గొండ అధికారులను కూడా కోరతామన్నారు. నిబంధనల ప్రకారం వారిని వెంటనే ఊర్లలోకి అనుమతించలేమని స్పష్టం చేశారు. క్వారంటైన్‌ గడువు తర్వాత మాత్రమే వారు ఇంటికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. క్వారంటైన్‌కు అంగీకరించే వారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తామని తేల్చి చెప్పారు. రెవెన్యూ అధికారులను కూడా సరిహద్దు వద్దకు పంపిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి వేలాది మంది ప్రయాణికులు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

ముందస్తు సమాచారం లేకపోవడంతోనే..

గుంటూరు రేంజ్‌ ఐజీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. 'ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో నిలిచిపోయిన వారితో మాట్లాడుతున్నాం. ముందస్తు సమాచారం లేకుండా హైదరాబాద్‌ నుంచి రావడం వల్లే సమస్యలు వస్తున్నాయి. క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. సరిహద్దుల్లో ఆగిన వారితో సంయమనంతో మాట్లాడాలని పోలీసులకు సూచించాం. రెవెన్యూ అధికారులతో కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం' అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

కరోనా కష్టాలు.. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారికి నో ఎంట్రీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details