ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ మార్కెట్ మళ్లీ మెుదలైంది..!

గుంటూరు కూరగాయల మార్కెట్లో కొద్ది రోజుల క్రితం కరోనా కేసులు కలకలం సృష్టించాయి. ఒక్కరి నుంచి పాతిక మందికి వైరస్ సోకిన నేపథ్యంలో మరో కోయంబేడుగా మారుతుందని అందరూ ఆందోళన చెందారు. అయితే ఆ తర్వాత కొత్త కేసులు రాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి జాగ్రత్తలు తీసుకుని మార్కెట్లో మళ్లీ కార్యకలాపాలు మొదలు పెట్టారు. మార్కెట్లో తీసుకుంటున్న కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ఈటీవి భారత్ ప్రత్యేక కథనం.

guntur-vegetable-market-re open
గుంటూరు కూరగాయల మార్కెట్

By

Published : Jun 10, 2020, 9:26 PM IST

గుంటూరు జిల్లాలో కూరగాయలకు సంబంధించి ప్రధానమైనది కొల్లి శారద హోల్ సేల్ కూరగాయల మార్కెట్. గతంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఈ మార్కెట్ ఉండేది. కరోనా దృష్ట్యా ఆర్టీసీ దీనిని నగరం వెలుపలికి తరలించారు. రెండున్నర నెలలుగా అక్కడే కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయితే మార్కెట్లో ఓ వ్యాపారికి కరోనా రావటంతో అధికారులు అప్రమత్తమై అందరికీ పరీక్షలు చేయించారు. అందులో 25మందికి కరోనా వచ్చినట్లు తేలింది. వీరిలో 18మంది వ్యాపారులు, కూలీలు కాగా... మిగతా వారు వారి కుటుంబసభ్యులు. దీంతో మార్కెట్ ను వారం రోజుల పాటు మూసివేశారు.

గుంటూరు కూరగాయల మార్కెట్

వ్యాపారుల విజ్ఞప్తి మేరకు మళ్లీ మార్కెట్ ను తెరిచేందుకు అధికారులు అనుమతించారు. అయితే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మార్కెట్లోకి ప్రవేశించే సమయంలోనే థర్మల్ స్కానర్ ద్వారా వారి శరీర ఉష్ణోగ్రత చూస్తున్నారు. మాస్కు తప్పనిసరి చేశారు. లేని వారికి మార్కెట్ తరపున అందజేస్తున్నారు. వ్యాపారులు, రైతులు, కూలీలు అంతా తగిన జాగ్రత్తలు తీసుకుని ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు.

స్కాన్ చేసిన తర్వాతే అనుమతి..

అధికారులు సూచించిన మేరకు ప్రతి దుకాణం 20 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉండేలా మార్పులు చేశారు. అలాగే దుకాణాలకు మధ్యలో 50 అడుగుల దూరం ఉండాలని సూచించటంతో... దానిని అమలు చేస్తున్నామని హోల్ సేల్ కూరగాయల మార్కెట్ అధ్యక్షులు సత్యనారాయణ తెలిపారు. ప్రతి ఒక్కరికి స్కాన్ చేసిన తర్వాతే లోపలకు అనుమతించటంతో పాటు... శానిటైజర్ తో శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. తమ సొంత ఖర్చులతో ఇక్కడకు వచ్చేవారికి మాస్కులు అందజేస్తున్నామని ఆయన తెలిపారు.

రద్దీ తగ్గటం మంచిదే...

ప్రస్తుతం నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే మార్కెట్లోకి వచ్చేలా చర్యలు తీసుకున్నామని మార్కెట్ గౌరవాధ్యక్షులు నిమ్మకాయల నారాయణ అన్నారు. గతంలో కంటే వ్యాపారాలు కొంచెం తగ్గాయిని... రద్దీ తగ్గటం కూడా ఒక రకంగా మంచిదేనని ఆయన అన్నారు. భౌతిక దూరం పాటించి వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం ఏర్పడిందన్నారు.

ఇవీ చదవండి:ఆంగ్లం రాక.. కరోనా వచ్చింది!

ABOUT THE AUTHOR

...view details