గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఐపీఎస్ అధికారి, గుంటూరు గ్రామీణ జిల్లా ఎస్‌ఈబీలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న కె.అరీఫ్ హాఫీజ్‌ను నియమించింది. అమ్మిరెడ్డికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
త్వరలో జరగబోయే ఐపీఎస్‌ల బదిలీల్లో ఆయన్ను మరో కీలకమైన జిల్లాకు ఎస్పీగా పంపిస్తారని ప్రచారం సాగింది. ఇలాంటి నేపథ్యంలో ఆయనకు అసలు పోస్టింగే ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించటం చర్చనీయాంశమైంది. ఏపీ సీఐడీ పెట్టిన రాజద్రోహం కేసులో అరెస్టై, వైద్యపరీక్షల కోసం సికింద్రాబాద్‌లోని సైనిక ఆసుపత్రిలో చేరిన ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల అమ్మిరెడ్డిపై రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఆసుపత్రి నుంచి తనను త్వరగా డిశ్ఛార్జి చేయించేందుకు సైనిక ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీరెడ్డి.. తితిదే జేఈవో ధర్మారెడ్డి, గుంటూరు అర్బన్ ఎస్పీగా ఉన్న అమ్మిరెడ్డితో కలిసి కుట్ర చేశారంటూ ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ, తాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే మళ్లీ గుంటూరుకు తీసుకెళ్లటం కోసం ఆసుపత్రి బయట 15 మంది పోలీసుల్ని మోహరింపజేసి అమ్మిరెడ్డి కుట్ర పన్నారని ఫిర్యాదులో ఆరోపించారు. ఆ 15 మంది పోలీసులకు సంబంధించిన మెస్ బిల్లులంటూ కొన్నింటిని ఆ ఫిర్యాదుతో జతపరిచారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే అమ్మిరెడ్డి ఆకస్మికంగా బదిలీ అయ్యారు.
వారంలో ఐపీఎస్‌ల బదిలీలు!