ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బాలికలతో వెట్టి చాకిరీ... ముగ్గురు అరెస్టు - guntur latest news

పేద బాలికలను ఇళ్లల్లో పనులకు కుదురుస్తున్న ముగ్గురిని గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్లతో పనులు చేయించుకున్న ఇంటి యజమానులపైనా కేసులు నమోదు చేసినట్లు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వెల్లడించారు. వెట్టి చాకిరీ నుంచి 8 మంది బాలికలకు విముక్తి కల్పించారు.

guntur crime news
guntur crime news

By

Published : Oct 2, 2020, 3:52 PM IST

బాలికలతో వెట్టి చాకిరీ చేయించే ముఠాను గుంటూరు అర్బన్ పోలీసులు పట్టుకున్నారు. 8 మంది బాలికలకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించి చైల్డ్ హోంకు తరలించినట్లు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి శుక్రవారం తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన కర్నాపు అసిరయ్య, వెంపాడ శ్రీను, కంభపు రాము ఓ ముఠాగా ఏర్పడ్డారు. రాజాం ప్రాంతం నుంచి పిల్లలను తెచ్చి గుంటూరు, విజయవాడలో అవసరమైన వారి ఇళ్లలో పనికి కుదురుస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులకు ఏడాదికి 50వేలు ఇచ్చి... ఇక్కడ యజమానుల నుంచి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది.

గుంటూరులోని నల్లపాడులో ఓ ఇంట్లో పనిచేస్తున్న బాలిక... అక్కడి నుంచి తప్పించుకుని డయల్ 100కు ఫోన్ చేసింది. పోలీసులు సత్వరం స్పందించి ఆ బాలికను రక్షించారు. బాలిక నుంచి వివరాలు సేకరించగా మరికొంతమంది తనతోపాటు వచ్చినట్లు వెల్లడించింది. రాజాం ప్రాంతంలో వాలంటీర్ల ద్వారా సమాచారం సేకరించారు పోలీసులు. ఈ క్రమంలో పిల్లలను అక్రమంగా రవాణా చేస్తున్న వారి వివరాలు తెలిశాయి. వెంటనే నిందితులు ముగ్గురిని అరెస్టు చేయటంతోపాటు మిగతా పిల్లలనూ విముక్తి కల్పించినట్లు ఎస్పీ వివరించారు.

బాలికల అక్రమ రవాణా, వెట్టి చాకిరీ వంటి వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ పేదరికాన్ని అడ్డు పెట్టుకొని.. బాలికలను తెచ్చి పని చేయిస్తున్నట్లు తెలిపారు. ఇలా మైనర్లతో పని చేయించడం నేరమని ఇంటి యజమానులు తెలుసుకోవాలన్నారు. ముగ్గురు నిందితులతోపాటు... పిల్లలతో పని చేయించుకున్న 8మంది ఇంటి యజమానులపై చట్టప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details