రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఓ ప్రకటన ఏజెన్సీ గుంటూరులో కాలు మోపింది. ఆ ఏజెన్సీకి అమాత్యుడొకరు అండగా ఉన్నారని.. నగరపాలక సంస్థ ఉద్యోగుల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రితో ఉన్న సంబంధాలను అడ్డుపెట్టుకుని సదరు నిర్వహకుడు మంత్రి నుంచి ఓ సిఫార్సు లేఖ పట్టుకొచ్చి.. నగరంలో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు వేసుకుని వాటిపై ప్రకటనల ఆదాయం పొందుతోంది. మంత్రి సిఫార్సు చేస్తే నిబంధనలు పక్కన పెట్టేసి ఆయన కోరిందే తడువుగా అనుమతులు ఎలా ఇస్తారనే విమర్శలు వస్తున్నాయి.
టెండర్ల ద్వారా మాత్రమే ఏజెన్సీలను ఎంపిక చేస్తామని అమాత్యునికి తెలియజేసి.. ఆ మేరకు ఆ ఏజెన్సీని నిలువరించే బాధ్యత నగరపాలక సంస్థపై ఉంది. అలాంటిది వారికి అనుమతులు ఇవ్వటంపై విమర్శలు వస్తున్నాయి. అదే సామాన్యులు ఎవరైనా తన ఇంట్లో జరిగే శుభ కార్యాలకు రహదారులు, కరెంటు స్తంభాలకు ఫ్లెక్సీలు వేస్తే వెంటనే వాటిని తొలగించి నానా హడావుడి చేస్తారు. లేదంటే నగర పాలక సంస్థకు రుసుములు చెల్లించి వాటని పెట్టుకోవాలని సూచిస్తారు.
మొత్తంగా నగర పాలక సంస్థకు రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. ఏజెన్సీలు లబ్ధి పొందుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నగరంలోని రహదారులు, డివైడర్ల మధ్య, విద్యుత్ స్థంభాలకు, ముఖ్య కూడళ్లలో హోర్డింగ్లు పెట్టుకోవాలన్నా, ఫ్లెక్సీలు వేసుకోవాలన్న నగర పాలక సంస్థ టెండర్లలో పాల్గొని.. వాటి నిర్వహణకు అనుమతి పొందాలి. వారు మాత్రమే అధికారికంగా ప్రజలు, వ్యాపార మార్గాలు, విద్యా సంస్థల నుంచి తమ వివరాలను ప్రదర్శించుకుంటాయి.