నాగార్జున సాగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం అమ్మకం కేసులో అరెస్టైన యలమంద నాయక్‌పై పోలీసులు ఎలాంటి వేధింపులు చేయలేదని.. గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ వివరణ ఇచ్చారు. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. ఇలాంటి వ్యాఖ్యల వల్ల పోలీసుల నైతిక స్థైర్యం, పోలీసులపై ప్రజలకు ఉన్న నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందన్నారు. గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
రెవెన్యూ అధికారుల సమక్షంలోనే యలమంద నాయక్‌ను అరెస్టు చేశామన్నారు. అరెస్టుకు ముందు కుటుంబ సభ్యులకు 50 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చామన్నారు. యలమంద నాయక్‌ను పోలీసులు వేధిస్తే.. న్యాయమూర్తి ముందు ఎందుకు చెప్పలేదని ఎస్పీ విశాల్ గున్నీ ప్రశ్నించారు. సీఆర్‌పీసీ చట్టం ప్రకారమే పని చేస్తున్నామని తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని విశాల్ స్పష్టం చేశారు. అరెస్టై విడుదలైన 15 రోజుల తర్వాత తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గురజాల డీఎస్పీ, సీఐ సస్పెన్షన్ వెనుక వారి పనితీరులో పురోగతి లేకపోవడమే కారణమన్నారు. వీరిద్దరి సస్పెన్షన్ వెనుక ఎలాంటి కోణాలు లేవని ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టం చేశారు.