గతంలో ఎన్నడూ చవిచూడని చేదు అనుభవాలు కరోనా వల్ల మానవాళికి ఎదురయ్యాయి. రాష్ట్రంలో మార్చి నెల నుంచి ప్రారంభమైన కొవిడ్ కేసుల తాకిడి జులై, ఆగస్టు మాసాల్లో తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తాజాగా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్న పరిస్థితిని గణాంకాలు చెబుతున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యసిబ్బంది సేవలు అందరి ప్రశంసలు అందుకున్నాయి. గుంటూరు జీజీహెచ్ కొవిడ్ ప్రత్యేక ఆస్పత్రిలో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వేలాది మందికి నిర్విరామంగా సేవలందించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో సేవలు, సదుపాయాలు సైతం గణనీయంగా మెరుగుపడ్డాయి. జీజీహెచ్‌లో తొలి నాళ్లలో 10 కిలోలీటర్ల ఆక్సిజన్ ప్లాంటు మాత్రమే అందుబాటులో ఉండేది. అందరికీ అప్పట్లో హైప్రెజర్ ఆక్సిజన్ అందుబాటులో ఉండేదికాదు. కొవిడ్ అనంతరం కొత్తగా 20 కిలోలీటర్ల ఆక్సిజన్ ప్లాంటును అందుబాటులోకి తెచ్చారు. దీంతో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ఇప్పటివరకు మరణాల రేటు ఒకశాతం లోపు నమోదైంది.
మెరుగైన వైద్యసేవలు
జీజీహెచ్‌లో 45 వరకు ఉన్న ఐసీయూ బెడ్ల సంఖ్య....100కి పెరిగింది. 250 వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చాయి. కిడ్నీ, లివర్, ఊపిరిపిత్తులు పరీక్షలను వేల సంఖ్యలో నిర్వహించారు. పేదలకు ఖరీదైన మందులను అందించారు. కొవిడ్ దృష్టిలో ఉంచుకుని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పోస్టులు గణనీయంగా పెరిగాయి. కొత్తగా 100 మంది వరకు వైద్యులు అందుబాటులోకి వచ్చారు. 300 నుంచి 350 వరకు స్టాప్ నర్సుల పోస్టులు భర్తీ చేశారు. కొత్తగా పారా మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. కొవిడ్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సదుపాయాలు సమకూరాయని.. ఇవి భవిష్యత్తు అవసరాలను తీర్చనున్నాయని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.