Temple for parents: తెలుగు రాష్ట్రాల్లో క్రేన్ వక్క పొడి అన్నా, దాని వ్యవస్థాపకుడు గ్రంధి సుబ్బారావు అన్నా తెలియని వారుండరు. చిన్నగా వ్యాపారం ప్రారంభించి.. పట్టుదల, మెలకువలతో ఆ సంస్థను అంతర్జాతీయ స్థాయికి చేర్చారు. గుంటూరు నగరానికి నైరుతి మూలన బరువు ఉంటే మంచి జరుగుతుందని గ్రంధి సుబ్బారావుకు గతంలో ఓ స్వామిజీ చెప్పారు. ఆ మేరకు నగర శివారులోని పొత్తూరు వద్ద వినాయక ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. 18అడుగుల కృష్ణశిలతో.. విగ్రహం ఏర్పాటు చేశారు. చుట్టూ ఆలయాన్ని నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. అయితే గ్రంధి సుబ్బారావు వయోభారంతో మరణించారు. ఆ కార్యాన్ని ఆయన కుమారుడు కాంతారావు స్వీకరించారు. వరసిద్ధి విఘ్నేశ్వరస్వామి క్షేత్రాన్ని పూర్తి చేశారు. తండ్రి ఆస్తులకే కాదు.. ఆయన ఆశయాలకూ వారసుడని నిరూపించారు.
తల్లిదండ్రుల విగ్రహాలనూ ఆలయ ఆవరణలో నిర్మించారు గ్రంధి కాంతావు. గుంటూరుకు చెందిన శిల్పి సుబ్బారావుతో కాంస్య విగ్రహాలను తయారు చేయించారు. త్రిదండి చినజీయర్ స్వామి ఈ విగ్రహాలను ఆవిష్కరించారు. సృష్టిలో అమ్మనాన్నల గౌరవాన్ని ఇనుమడింపజేయాలనే మందిరం నిర్మించినట్లు కాంతారావు తెలిపారు.