పాలు, తేనే, నెయ్యి, నూనె, టీపొడి, పప్పు దినుసులు, కారప్పొడి, మిరియాలు... ఇలా అసలుకు నకిలీలు మార్కెట్లో విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. నిత్యావసర సరకులు, ఆహార పదార్థాలతో పాటు పిల్లల చాక్లెట్లు, బిస్కెట్లు ఇలా అనేక తినుబండారాల్లో రంగులు కలిపి సొమ్ము చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో గతంలో జరిపిన అధికారుల దాడుల్లో విస్తుగొల్పే వాస్తవాలు బయటపడ్డాయి.ఆహార భద్రత, ప్రమాణాల అధికారులు కేసులు పెడుతున్నా కల్తీరాయుళ్లు వెనక్కి తగ్గడం లేదు. కల్తీ ఘాటు మార్కెట్ ను ముంచెత్తుతూనే ఉంది. మరోవైపు ఏది కల్తీనో... ఏది అసలో సామాన్య ప్రజలకు తెలియడం లేదు.
ఏది కొన్నా ఏమున్నది...కల్తీ తప్పా...! ప్రతి నాలుగు నమూనాల్లో ఒకటీ కల్తీ...
2016-17లో ఓ పరిశీలనలో ప్రతి నాలుగు ఆహార నమూనాల్లో ఒకటి కల్తీదని తేలింది. 2014-15లో 9.6 శాతమున్న ఆహారకల్తీ... 2016-17కి వచ్చేసరికి 23.4 శాతానికి పెరిగింది. దేశంలో పాలతో పాటు వాటి అనుబంధ పదార్థాల ఉత్పత్తిలో 68 శాతం ఆహార భద్రత ప్రమాణాలకు అనుగుణంగా లేవని నివేదికలు తెలుపుతున్నారు.ప్రమాదకర కార్బైడ్ వినియోగంతో పళ్లు సైతం ప్రజల ఆరోగ్యాన్ని గుల్లచేస్తున్నాయి.
సామాన్య ప్రజలు ఆహార కల్తీ బారినపడుతున్నా.... దీనిపై సరైన ప్రచారం, చైతన్యం కొరవడింది. గుంటూరులో సొసైటీ ఫర్ సేఫ్ ఫుడ్ వంటి సంస్థలు అవగాహన కల్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కల్తీ ఆహారంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని... శరీరంలోని పలు భాగాలు అనారోగ్యం బారినపడే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
దాడులు మరింత విస్తృతం
ఆహార కల్తీ నియంత్రణకు గతంలో 8 రకాల చట్టాలుండేవి. శిక్షలు కూడా కఠినంగా ఉండేవి. 2006లో ఆహార భద్రత, ప్రమాణాల చట్టం వచ్చాక... కాస్త పదును తగ్గింది. ఎక్కువ కేసుల్లో సంబంధింత నమూనాలు సురక్షితం కాదని మాత్రమే తేల్చి చెబుతుండటంతో నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్నారు. ఆహార భద్రత, ప్రమాణాల శాఖలో తగినంత సిబ్బంది లేకపోవడంతో పర్యవేక్షణ, తనిఖీలు నామమాత్రంగా సాగుతున్నాయి. ఉన్న మానవ వనరులతోనే అధికారులు దాడులు చేస్తున్నారు. త్వరలో సిబ్బంది సంఖ్య పెరగనుందని.... దాడులు మరింత విస్తృతం చేయనున్నామని చెబుతున్నారు ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అధికారులు.
సమాజ భద్రతకే సవాలు విసురుతున్న ఆహార కల్తీని అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. సిబ్బంది సంఖ్యను పెంచి పర్యవేక్షణ పెంచాల్సిన అవసరముంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.