గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని అత్తోట గ్రామానికి చెందిన యర్రు అప్పారావు, బాపారావు తండ్రీ కొడుకులిద్దరూ రసాయనిక ఎరువుల పంటకు విరుద్ధంగా ప్రకృతి సేద్యంతో పంట పండిస్తున్నారు. రసాయన ఎరువుల నిర్మూలనే తమ లక్ష్యంగా భావిస్తున్నామన్నారు. యువ రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతిసిద్ధంగా పండించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చును సూచిస్తున్నారు.
దీనిలో భాగంగా రైతాంగాన్ని తమ వైపు దృష్టి సారించే విధంగా వినూత్నంగా పంటను పండిస్తున్నారు. కళాత్మకంగా ప్రకృతి వ్యవసాయం చేయడంలో అత్తోటవాసులు కళలకాణాచిగా విరాజిల్లుతున్నారు. వ్యవసాయక్షేత్రంలో కళాత్మకమైన ఆధ్యాత్మిక అంశాలను వరినారుతో రూపొందించి.. ప్రకృతి వ్యవసాయం పట్ల, ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఆ తండ్రీ కొడుకులు.
''గత ఆరు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. రసాయన రహిత ఉత్పత్తుల వల్ల ఆరోగ్యంతో పాటు, భూమి కలుషితం కాకుండా చూస్తున్నాం. షుగర్ వ్యాధితో బాధపడేవారి కోసం నాసరా రకం వరి పండిస్తున్నాం. దీనితో పాటు కాలాబట్టి అనే రకం బియ్యం పండిస్తున్నాం.. అవి క్యాన్సర్, రోగనిరోధక శక్తి పెరిగేందుకు ఉపకరిస్తుంది. ప్రకృతి పద్ధతిలో పండించేందుకు సిద్ధంగా ఉన్నవారికి విత్తనాలు ఇచ్చేందుకు మేము సంసిద్ధం.'' - యర్రు బాపారావు, రైతు
కరోనా ఉద్ధృతంగా ఉన్నపుడు..లాక్ డౌన్ కారణంగా జనజీవనం స్తంబించిన సమయంలో కొందరు భక్తులు.. వీరి పొలంలోనే ప్రకృతి వ్యవసాయ సాగులో మెళకువలు తెలుసుకున్నారు. ఆ సమయంలో వరినారుతో గోవింద నామాలు తీర్చిదిద్ది వెంకన్న స్వామి పట్ల తమకున్న భక్తిని కళాత్మకంగా చాటుకున్నారు. ఈ సారి దసరా ప్రాధాన్యతను చాటే విధంగా.. దుర్గమ్మ, మహాత్మా గాంధీ జయంతికి.. గాంధీజీ ఆకృతిని, స్వదేశీ వస్త్రాలకు ఆలంబనగా నిలిచే.. నూలు ఒడికే రాట్నం ఆకృతులను వరినారుతో వ్యవసాయ క్షేత్రంలో రూపొందించారు.