గుంటూరు జిల్లాలో వైద్యరంగం, ఔషధ రంగంలో అనూహ్య పెరుగుదల కనిపిస్తోంది. నగరంలోని కొత్తపేట, బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం, గుజ్జనగుండ్ల ప్రాంతాల్లో మందుల దుకాణాలు గతంతో పోలిస్తే బాగా పెరిగాయి. కరోనా వ్యాధి వచ్చిన తర్వాత ప్రజలు మందులు వినియోగించటం విపరీతంగా పెరిగింది. హోం ఐసోలేషన్‌కు అనుమతించటంతో ఇళ్ల వద్దే ఉండి వైద్యులు సూచించిన మందులు వాడుతున్నారు. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచే ఇమ్యూనిటి బూస్టర్స్ ఎక్కువమంది వినియోగిస్తున్నారు. ఈ కారణంగానే మందుల అమ్మకాల్లో గణనీయంగా పెరుగుదల కనిపిస్తోంది.
పెరిగిన విక్రయాలు...
జిల్లావ్యాప్తంగా హోల్ సేల్ దుకాణాలే 800, రిటైల్ దుకాణాలు 2వేల 500 ఉన్నాయి. అన్నిచోట్ల కలిపి సగటున రోజుకు 6 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరుగుతాయి. గుంటూరు, నరసరావుపేట వంటి ప్రధాన పట్టణాల్లో కొన్ని హోల్‌సేల్ షాపుల్లో సగటున రూ.2 లక్షల వరకు, మరికొన్ని షాపుల్లో రూ.50 వేల నుంచి లక్ష వరకు విక్రయాలు ఉండగా... మిగిలిన పట్టణాల్లో రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకూ జరుగుతాయి.
కరోనాకు ముందురోజుకు రూ.4 నుంచి 4.50కోట్ల రూపాయల వరకు వ్యాపారం ఉండేది. ఇటీవలి కాలంలో బి కాంప్లెక్సు, విటమిన్ సి, డి, అజిత్రోమైసిన్, సిట్రజిన్, డోలో-650, మల్టీ విటమిన్స్, ఆవిరిపట్టే మిషన్లు బాగా విక్రయమవుతున్నాయని వ్యాపారవర్గాలు తెలిపాయి. కరోనా తీవ్రత దృష్ట్యా ఎవరికి వారు ఈ మందులను బాగా కొనుగోలు చేసి నిల్వలు పెట్టుకున్నారు. కొందరేమో కరోనా నియంత్రణలో భాగంగా వాటిని వేసుకుంటున్నారు. ఈ కారణంగా గతంలో కంటే వ్యాపారం రోజుకు మరో రెండు కోట్లు అదనంగా పెరిగిందని అంచనా.