ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ex CM Rosaiah passed away: మాటల్లో మాధుర్యం... చేతల్లో చాణక్యం - Ex CM Rosaiah died news

Ex CM Rosaiah passed away : నిండైన రూపం, తెలుగుదనం ఉట్టిపడే ఆహార్యం, మాటల్లో మాధుర్యం, చేతల్లో చాణక్యం, ఇలా అన్నీ కలగలిపిన వ్యక్తే కొణిజేటి రోశయ్య. పల్లె నుంచి దిల్లీ స్థాయికి ఎదిగినా ఎప్పుడూ మూలాలు మరువలేదు. మాటకారితనంతో పార్టీలకు అతీతంగా అందరి నాయకుల గౌరవం పొందిన మంచి మనిషి. ప్రతి ఒక్కరినీ కలుపుకుపోయే మనస్తత్వమే ఆయన్ను వార్డు మెంబర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా ఎదిగేలా చేసింది. గుంటూరు జిల్లా వేమూరులో పుట్టి, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన రోశయ్య కన్నుమూత.. తెలుగు ప్రజలకు తీరని లోటు. ఆయన జీవిత ప్రస్థానంపై ప్రత్యేక కథనం.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత

By

Published : Dec 5, 2021, 4:27 AM IST

Ex CM Rosaiah passed away : రోశయ్య. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. గుంటూరు జిల్లా వేమూరులో ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు 1933 జూలై 4న జన్మించారు. ప్రాథమిక విద్య అంతా గ్రామంలోనే సాగింది. తర్వాత 8వ తరగతికి చిన్న బసవయ్య కొలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేరారు. చిన్నప్పటి నుంచే చదువుల్లో రాణించేవారు. గణితంపై పట్టు సాధించారు. పాఠశాలల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో ఎంతో చతురతతో మాట్లాడేవారు. ప్రతి ఒక్కరికీ సాయం అందించడంలో ముందుండే రోశయ్య.... తెలివైన విద్యార్థని ఆయనకు చదువు చెప్పిన గురువులు గుర్తుచేసుకున్నారు.

తెనాలిలో ఇంటర్ పూర్తి చేసిన రోశయ్య.... ఉన్నత విద్యకోసం గుంటూరు హిందూ కళాశాలలో చేశారు. అక్కడ కామర్స్ డిగ్రీ చదివారు. ఆ సమయంలోనే రాజకీయాలపై ఆసక్తితో అనతి కాలంలోనే విద్యార్థి సంఘ నాయకునిగా ఎదిగారు. రైతు నాయకునిగా పేరొందిన ఎన్జీ రంగా శిష్యరికంలో రాటుదేలారు. 1968లో తొలిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరో 2 సార్లు ఆ పదవి చేపట్టారు. 1985లో తెనాలి ఎమ్మెల్యేగా, 2004లో ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడిగా విజయం సాధించారు. ఇలా రెండు జిల్లాల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన అతి కొద్దిమందిలో రోశయ్య ఒకరు. 1998లో నరసరావుపేట ఎంపీగా గెలిచారు. దిల్లీ రాజకీయాలపై ఆసక్తి లేక ఆ తర్వాతి ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యే గానే పోటీ చేశారు. 3 రకాల చట్టసభల్లో సభ్యునిగా పనిచేసిన అరుదైన నేతగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి ముఖ్యమంత్రులు ఎవరైనా సరే రోశయ్య వారి మంత్రివర్గంలో ఉండాల్సిందే. వేమూరు, తెనాలి, బాపట్ల, గుంటూరులో ఆయనకు ఎంతో మంది స్నేహితులు, బంధువులున్నారు. రోశయ్య మరణం వారిని తీవ్ర విషాదంలో ముంచింది.

Ex CM Rosaiah passed away : రోశయ్యకు మొదట్లో రైస్ మిల్ ఉండేది. బియ్యం వ్యాపారమూ చేసేవారు. తన కుమారుడికి బాపట్లకు చెందిన అమ్మాయితో వివాహం జరిపించారు. అలా బాపట్లలో ఆయనకు బంధుగణంతో పాటు స్నేహితులు పెరిగారు. అక్కడి ఆర్య వైశ్యులంతా కలిసి కొణిజేటి రోశయ్య జూనియర్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశారు. రాజకీయాలతో పాటు వ్యాపారంలోనూ ఆయన శిష్యులుగా ఉన్నవారు రోశయ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అజాత శత్రువుగా గుర్తింపు పొందిన రోశయ్య.. శాసనసభలో జరిగే చర్చల్లోనూ ఎంతో హుందాగా ఉండే వారు. ముఖ్యంగా తనకన్నా చిన్నవారికి రాజకీయాలు, సభా నియమాల పట్ల మార్గనిర్దేశం చేసేవారు. 1999లో తెనాలిలో రోశయ్యపై గోగినేని ఉమ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. వయసులో చిన్నైనా తనను రోశయ్య ఎంతగానో గౌరవించేవారని గోగినేని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. వేమూరు ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేసిన నక్కా ఆనంద్ బాబు రోశయ్య విలువలతో కూడిన రాజకీయాలు చేశారని కొనియాడారు.

తెలుగు రాష్ట్రాల్లో పాతతరం రాజకీయ నాయకుల్లో రోశయ్య ఒకరు. ఇప్పుడు ఆయన మరణం విలువలతో కూడిన రాజకీయాలకు విఘాతమనే చెప్పాలి.

అనుబంధ కథనాలు..

ABOUT THE AUTHOR

...view details